
టీడీపీ మండలాధ్యక్షుడి రాజీనామా
కోట: తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తమరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ఆయన నివాసంలో తెలిపారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి, అలాగే గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌కు పంపినట్లు తెలిపారు. పార్టీ మండలాధ్యక్ష పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు తెలిపారు.
పార్టీలో విభేదాలే కారణమా?
టీడీపీ మండలాధ్యక్షుడిగా 2017 నుంచి కొనసాగుతున్న సర్వోత్తమరెడ్డి పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక పార్టీలో విభేదాలే కారణంగా తెలుస్తోంది. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌కు ముఖ్య అనుచరుడిగా సర్వోత్తమరెడ్డి గుర్తింపు పొందారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అండతో కోట మండలంలో తనదైన ముద్ర వేశారు. అధికారుల బదిలీలు, రాజకీయ కార్యకలాపాల్లో ఆయన మాటే చెలామణి అయ్యేది. కానీ పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాల కారణంగా ఆయన గత కొంతకాలంగా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీలోని ఓ వర్గం ఆయన్ని వ్యతిరేకిస్తుండగా కొందరు నేతలు అవమానకర రీతిలో మాట్లాడినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
విద్యార్థులకు
బిజినెస్ ప్లాన్ పోటీలు
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీలో విద్యార్థినులకు మహిళా వర్సిటీ, తిరుపతి ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంట్రా–ఇన్‌స్టిట్యూషనల్ బిజినెస్ ప్లాన్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఐఐఈ కోకన్వీనర్ లలిత, సభ్యులు రాజ్యలక్ష్మీ, రమాజ్యోతి మాట్లాడుతూ విద్యార్థుల్లోని వినూత్న వ్యాపార ఆలోచనలను ప్రదర్శించేందుకు పోటీలు దోహదపడతాయని వివరించారు. విద్యార్థులు 12 బృందాలుగా ఏర్పడి తమ బిజినెస్ ఐడియాలతో పోటీలో పాల్గొనడం హర్షనీయమన్నారు.
28 నుంచి అటానమస్
కళాశాలలో డిగ్రీ పరీక్షలు
తిరుపతి సిటీ: అటానమస్ హోదా పొందిన టీటీడీ డిగ్రీ కళాశాలలో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు 2వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అటానమస్ పొందిన ఎస్వీ ఆర్ట్స్, పద్మావతి డిగ్రీ అండ్ పీజీ, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలల అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరీక్షలకు 3 వేల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.