
ఎమ్మెల్యే నాని పేరుతో బరితెగింపు
● 15 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిని కాజేసే కుట్ర ● కోర్టులో కేసు నడుస్తుండగా దౌర్జన్యంగా భూమి చదును ● ఇదేమిటని ప్రశ్నిస్తే దాడికి యత్నిస్తున్నారంటున్న బాధితుడు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: చంద్రగిరి ఎమ్మెల్యే నాని పేరుతో తన భూమిని దౌర్జన్యంగా కాజేసేందుకు స్థానిక నాయకుడు కిషోర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. పూర్తి వివరాలు బాధితుడు రమణారెడ్డి, ఆయన కుమారుడు షారెడ్డి మాటల్లోనే.. ‘తిరుపతికి చెందిన రమణారెడ్డి 2004లో రూ.10లక్షలు వెచ్చించి తిరుచానూరు దళితవాడ సమీపంలోని సర్వే నం.334/12లోని 20 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో తిరుచానూరుకు చెందిన మణిరెడ్డి అలియాస్ మణయ్య భూమి తనదంటూ తిరుపతిలో కేసు వేసి విఫలమయ్యాడు. ఈ క్రమంలో మరోసారి మణిరెడ్డి తనయుడు, తిరుచానూరు పంచాయతీకి చెందిన టీడీపీ నేత కిషోర్‌రెడ్డి తప్పుడు పత్రాలను సష్టించి కోర్టులో కేసు వేశారు. దీంతో రమణారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఐదేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పుడు టీడీపీ నేత కిషోర్‌రెడ్డి తన అనుచరులతో కలసి భూమిలోకి అక్రమంగా ప్రవేశించాడు. టిప్పర్ల ద్వారా మట్టిని తరలించి, జేసీబీలతో చదును చేస్తున్నాడు. ‘అధికారం మాది మా వెనుక ఎమ్మెల్యే నాని ఉన్నాడు..పనులకు అడ్డొస్తే నీ అంతు చూస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. న్యాయం చేయాలని తిరుచానూరు పోలీసులను ఆశ్రయిస్తే తనను బెదిరిస్తున్నారని, సీఐ సునీల్ కుమార్ తనను అమర్యాదగా మాట్లాడుతున్నారు’అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు.
ఇంత అన్యాయమా?
నేను గత 15 ఏళ్ల క్రితం రమణారెడ్డికి చెందిన భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నా. అప్పట్లో ఆ భూమిపై కోర్టులో కేసు వేసినా, రమణారెడ్డికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిందని దౌర్జన్యంగా ఇక్కడ పనులు చేస్తున్నారు. ఈ భూమి రమణారెడ్డికి చెందినదే. టీడీపీ నాయకుడు కిషోర్‌రెడ్డి కోర్టులో కేసు నడుస్తున్నా పట్టించుకోకుండా ఇలా చేయడం మంచిది కాదు. ఈ ప్రభుత్వంపై మాలాంటి దళితులకు నమ్మకం పోతోంది.
– మణి, కౌలు రైతు, తిరుచానూరు హరిజనవాడ

ఎమ్మెల్యే నాని పేరుతో బరితెగింపు