
మాధారం పాఠశాలలో విద్యార్థిఆధార్ నమోదు చేస్తున్న సిబ్బంది
వికారాబాద్ అర్బన్: విద్యాశాఖలో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలు, వసతిగృహాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. పాఠశాల స్థాయిలో కూడా ఈ పద్ధతిని కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రతీ విద్యార్థికి ఆధార్ నంబర్ ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా, మధ్యాహ్న భోజనం పథకంలో పిల్లల హాజరు శాతాన్ని ఎక్కువ చూపకుండా ఉండేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 50 శాతం మందికిపైగా విద్యార్థులకు ఆధార్ లేకపోవడంతో బయోమెట్రిక్ మిషన్లలో వేలిముద్రలు పడటం లేదు. కొందరికి ఆధార్ ఉన్నా పుట్టిన తేదీ, ఇంటి పేరు తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలు నెలకొన్నాయి. వీటిని సరిచేసేందుకు గాను విద్యార్థుల సౌకర్యార్థం ఆధార్ నమోదు, సవరణ, వేలిముద్రల అప్‌డేట్ కోసం పాఠశాలల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మండలానికో ఆపరేటర్ చొప్పున నియమించారు. వీరి ద్వారా జిల్లాలోని అన్ని స్కూళ్లలో విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలు స్వీకరిస్తున్నారు.
ప్రయోజనాలివే..
బయోమెట్రిక్ హాజరు ద్వారా పాటు, పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా చూడటం, మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చేసి చూపే అవకాశం ఉండదు. సంక్షేమ వసతి గృహాల్లో పారదర్శకత పెరుగుతుంది.
సరిచేసుకునే అవకాశం
జిల్లాలో మొత్తం 1,030 పాఠశాలలు ఉండగా అందులో 91,898 మంది విద్యార్థులు చదువుతున్నారు. తల్లిదండ్రులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో మొదటి ఆధార్ తీసుకున్న సమయంలో చాలా వరకు తప్పుడు సమాచారం నమోదైంది. ప్రస్తుతం పాఠశాలలో నమోదు చేసిన, ఆధార్‌లో నమోదైన పుట్టిన తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. కొందరు విద్యార్థుల వేలి ముద్రలు కూడా సరిపోలడం లేదు. వీరు రెసిడెన్షియల్, సంక్షేమ హాస్టళ్లలో చేరేందుకు వెళితే ఆధార్ వివరాలు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు. వీటిని సరిచేసుకోవాలని పిల్లల తల్లిదండ్రులకు తెలిసినా దగ్గర్లో ఆధార్ కేంద్రాలు లేక నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనికి తోడు చాలా మంది విద్యార్థులకు అసలు ఆధార్ కార్డే లేకపోవడం గమనార్హం. ఫలితంగా వీరు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. విద్యార్థుల వివరాలను నమోదు చేయడం ఉపాధ్యాయులకు సైతం సమస్యాత్మకంగా మారింది. వీటన్నింటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠశాలల్లో ఆధార్ నమోదు డ్రైవ్ చేపట్టింది. కార్డు లేనివారికి ఉచితంగా ఆధార్ అందించడంతో పాటు, ఇప్పటికే ఉండి తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రుల వేలిముద్రలు, ఐరిస్ వంటి వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment