
పల్లె గొంతెండుతోంది!
దుద్యాల్: మండుటెండులు ముదురుతున్న తరుణంలో ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి ఆరు రోజులు గడుస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో కనీస అవసరాలకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని మండలంలోని ఆలేడ్ గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ తాగునీటి సరఫరా ఆరు రోజులుగా బంద్ కావడంతో అవస్థలు పడుతున్నారు. గత్యంతరం లేక గ్రామ సమీపంలోని వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకొని కాలం వెళ్లదీస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందరికీ అదే మాటే
మిషన్ భగీరథ నీటి సరఫరా ఈ నెల 9 నుంచి బంద్ కావడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేయడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కొందరు గ్రామానికి సరఫరా అయ్యే బోరును తమ వ్యవసాయ పొలాలకు వాడుతున్నారనే ఆరోపణ కూడా వ్యక్తం అవుతోంది. గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసే సంబంధిత వ్యక్తిని ఫోన్ ద్వారా సంప్రదించగా... పైపు లైన్ పగిలిపోయిందని, మరమ్మతులు చేస్తున్నారని సెలవిచ్చారు. గ్రామస్తులకు సైతం ఇదే సమాధాన్ని ఆరు రోజులుగా చెబుతుండడం గమనార్హం. మరోవైపు గ్రామంలోని పాఠశాలలో వేసిన బోరు నుంచి వచ్చే కొద్దిపాటి నీటితో కొందరు ఉపశమనం పొందుతున్నారు.
ధర్నా చేపడతాం
ఉన్నతాధికారులు స్పందించి వెంటనే గ్రామంలో తాగునీటి సరఫరా చేయాలని కోరుతున్నారు. లేకుంటే అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేపడుతామని హెచ్చరిస్తున్నారు. ఊరిలో తాగునీటి సరఫరా ఇబ్బందిగా మారినప్పుడు గ్రామ పంచాయతీ ట్యాంకర్ సహాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల హస్నాబాద్‌లో తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికార యంత్రాంగం స్పందించి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు. అదే మాదిరి తమ గ్రామంలో చర్యలు తీసుకోవాలని ఆలేడ్ గ్రామస్తులు క‘న్నీటి’తో విజ్ఞప్తి చేస్తున్నారు.
వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. మొన్న హస్నాబాద్.. ఇవాళ ఆలేడ్ గ్రామాలలో మిషన్ భగీరథ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగు నీటికి అరిగోస పడుతున్నారు.
ఆరు రోజులుగా మిషన్ భగీరథ బంద్
తీవ్ర అవస్థలు పడుతున్న ఆలేడ్ గ్రామస్తులు
స్పందించని అధికార యంత్రాంగం

పల్లె గొంతెండుతోంది!