గుర్తు తెలియని వాహనం ఢీ, వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీ, వ్యక్తి మృతి

Published Sat, Mar 15 2025 7:39 AM | Last Updated on Sat, Mar 15 2025 7:39 AM

గుర్తు తెలియని వాహనం ఢీ, వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీ, వ్యక్తి మృతి

పరిగి: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి రంగంపల్లి కాటన్‌మిల్లు సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి నుంచి రంగంపల్లి వైపు హైదారాబాద్‌– బీజాపూర్‌ జాతీయ రహదారిపై సుమారు 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి, గురువారం రాత్రి 10 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలై దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతున్ని గుర్తించిన వారు 8712670041 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

అనంతగిరి: కాంగ్రెస్‌ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను మానుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం వికారాబాద్‌లో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని సస్పెండ్‌ చేయడాన్ని ఖండిస్తూ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గోపాల్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్‌ చేశారని, ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పని చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు సుభాన్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

చెరువులో పడి మేసీ్త్ర మృతి

కొడంగల్‌ రూరల్‌: తాగిన మైకంలో ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం రుద్రారం పరిధిలోని పాటిమీదిపల్లి భీరం చెరువులో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బషీరాబాద్‌ మండలం బాదులాపూర్‌తండాకు చెందిన రాథోడ్‌ మోహన్‌(46) మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మద్యం తాగి బీరం చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత సరిగ్గా రాకపోవడంతో చెరువులో మునిగి మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి భార్య సాలీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు.

ఆదివాసీ సంఘీభావ వేదిక ఏర్పాటు

ముషీరాబాద్‌: ఉమ్మడి హైదరాబాద్‌ ఆదివాసీ సంఘీభావ వేదికను ఏర్పాటు చేశారు. శుక్రవారం విద్యానగర్‌లోని మార్క్స్‌ భవన్‌లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.లక్ష్మణ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేదిక కన్వీనర్లుగా దళిత లిబరేషన్‌ ఫ్రంట్‌ నుంచి ఇందిర, ప్రజా కళామండలి నుంచి రాణి, చైతన్య మహిళా సంఘం నుంచి జయ, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం నుంచి రవి, ఏఐఎఫ్‌టీయూ నుంచి మల్లేష్‌, పీడీఎస్‌యూ మహేష్‌, అమరుల బంధుమిత్రుల సంఘం సత్యను ఎంపిక చేశారు. అలాగే పౌర హక్కుల సంఘం హైదరాబాద్‌ జిల్లా కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ వేదిక కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని లక్ష్మణ్‌ తెలిపారు. ఆదివాసీలపై మారణహోమాన్ని నిలిపి వేయాలని, సహజ వనరుల దోపిడీని అరికట్టాలని, పోలీసు క్యాంపులను ఎత్తివేయాలని వారు డిమాండ్‌ చేశారు.

రూ.5లక్షల విలువైన విద్యుత్‌ వైర్లు చోరీ

యాచారం: ఐదు లక్షల రూపాయల విలువ జేసే విద్యుత్‌ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. వివరాలివీ.. మండల పరిధిలోని గునుగల్‌ గ్రామంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇంజాపూర్‌ గ్రామానికి చెందిన నోముల కృష్ణాగౌడ్‌ బాలాజీ వెంచర్‌ను ఏర్పాటు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల క్రితం వెంచర్‌లోని విద్యుత్‌ స్తంభాలకు ఉన్న రూ.5 లక్షల విలువ జేసే వైర్లను కత్తిరించి ఎత్తుకెళ్లారు. సిబ్బంది సమాచారం మేరకు యజమాని యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యుత్‌ వైర్లతో పాటు విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement