
రేషన్.. వచ్చెన్
● దశాబ్దకాల నిరీక్షణకు తెర ● జిల్లాలో కొత్తగా 22,388 రేషన్ కార్డులు జారీ ● మార్చి కోటా 5,603 మెట్రిక్ టన్నుల బియ్యం విడుదల
బషీరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం దశాబ్దకాలం పాటు ఎదురు చూసిన వారి నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభల ద్వారా తీసుకున్న దరఖాస్తులతో పాటు పెండింగ్ జాబితాలోని అర్హులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. మార్చి కోటా బియ్యం కూడా విడుదల చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ప్రామాణికం కావడంతో కొత్త కార్డుల జారీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
జిల్లాలో 2,63,573 మంది లబ్ధిదారులు
కొత్త రేషన్ కార్డుల జారీతో జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. గతంలో 2,41,185 మంది లబ్ధిదారులు ఉండగా 5,337.31 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసేవారు. కొత్తగా 22,388 కార్డులు అందుబాటులోకి రావడంతో అదనంగా 266.098 మెట్రిక్ టన్నుల బియ్యం కోటాను విడుదల చేశారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య 2,63,573 మందికి చేరుకుంది. 26,730 అంత్యోదయ కార్డులు, 39 అన్నపూర్ణ యోజన కార్డులు ఉన్నాయి. కార్డులోని ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తున్నారు.
డిజిటల్ కార్డుల జారీకి కసరత్తు
సంక్షేమ పథకాల అమలులో అవకతవకలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్ రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తోంది. కొత్తగా రూపొందించే కార్డులో కుటుంబ సభ్యులను చేర్చేందుకు.. తొలగించేందుకు సులువుగా ఉండేలా తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ పూర్తయితే జూన్ నెలలో డిజిటల్ రేషన్‌కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
దరఖాస్తు చేసుకున్న ఎనిమిదేళ్లకు..
ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయాక ఎనిమిదేళ్ల క్రితం కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేశా. కార్డు రాలేదు. నాతోపాటు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రజాపాలన గ్రామసభలో మళ్లీ దరఖాస్తు చేశా. ఇప్పుడు నా పేరిట రేషన్ కార్డు మంజూరైంది. ఇంకా బియ్యం తీసుకోలేదు.
– తలారి సావిత్రి, మంతట్టి
మీసేవ కేంద్రాల్లో డౌన్‌లోడ్ చేసుకోవాలి
జిల్లాకు కొత్తగా 22,388 రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన జాబితాను డీలర్లకు అందజేశాం. కార్డు మంజూరైన వారు మీసేవ కేంద్రాలు లేదా ఆన్‌లైన్ సెంటర్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్త కార్డులకు మార్చి నెల కోటా బియ్యం పంపిణీ చేశాం.
– మోహన్‌బాబు, డీఎస్‌ఓ

రేషన్.. వచ్చెన్
Comments
Please login to add a commentAdd a comment