
‘పది’ పరీక్షలకు వేళాయె!
ఈ నెల 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు టెన్త్ ఎగ్జామ్స్
● ఏర్పాట్లలో నిమగ్నమైన విద్యాశాఖ ● జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలు, 12,901 మంది విద్యార్థులు ● ఠాణాలకు చేరిన ప్రశ్న పత్రాలు
తాండూరు: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది చోటుచేసుకున్న పేపర్ లీకేజీ వంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 307 పాఠశాలలు ఉండగా 12,901 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 6,452 మంది బాలికలు, 6,449 మంది బాలురు ఉన్నారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలు
పదో తరగతి ప్రశ్న పత్రాలు జిల్లాకు చేరాయి. శనివారం వాటిని ఆయా కేంద్రాల సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించి భద్రపరిచారు. మరికొన్ని సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు రావాల్సి ఉంది. మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.
పరీక్షల నిర్వహణకు 920 మంది అధికారులు
జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు 920 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. 8మంది కస్టోడియన్లు, 69 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 69మంది సూపరింటెండెంట్లు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 700 మంది ఇన్విజిలేటర్లు, 69 మంది సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బందిని నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
పాఠశాలల వారీగా పదో తరగతి విద్యార్థులు
విద్యా సంస్థలు స్కూళ్ల సంఖ్య బాలికలు బాలురు
జెడ్పీహెచ్‌ఎస్ 165 2,676 3,163
ప్రభుత్వ 9 296 131
ఎయిడెడ్ 2 14 16
కేజీబీవీ 18 831 0
ప్రైవేట్ 69 1,211 1,596
బీసీ వెల్ఫేర్ 10 287 379
ఎస్సీ వెల్ఫేర్ 7 238 293
ఎస్టీ వెల్ఫేర్ 4 149 140
ఎస్టీ ఆశ్రమ 6 197 124
టీఎంఆర్‌ఐఈఎస్ 6 113 151
టీఎస్‌ఎంఎస్ 9 295 456
టీఆర్‌ఈఐఎస్ 2 145 0
అన్ని ఏర్పాట్లు చేశాం
పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గత సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాం. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరి కరాలను నిషేధించాం. పరీక్ష విధులకు హాజరయ్యే సిబ్బందికి కూడా ఆ ఆదేశాలు వర్తింపజేశాం. జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాలు, 12,901 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
– రేణుకాదేవి, డీఈఓ

‘పది’ పరీక్షలకు వేళాయె!
Comments
Please login to add a commentAdd a comment