లారీ, బైక్ ఢీ.. యువకుడి మృతి
చేవెళ్ల: లారీ బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధి ఖానాపూర్ బస్‌స్టేజీ సమీపంలోని హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై సోమ వారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన భగిర్తి వెంకటయ్య, సుమిత్రలకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు బి.సాయికుమార్(20) ఉన్నారు. ఇద్దరు కూతుర్ల వివాహం చేశారు. కుటు ంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సాయి పదో తరగతితోనే చదువు ఆపేసి, ప్రైవేటు పనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటి లాగే యువకుడు పనికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ యువకుడు నడుపుతున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను ఎగిరి కిందపడగా.. బైక్‌తో పాటు యువకుడి తలపై నుంచి లారీ ముందుకు దూసుకుపోయింది. దీంతో సాయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించారు. లారీని డ్రైవర్ అక్కడే వదిలేసి పారిపోయాడు. మృతుడు సాయికుమార్‌గా గుర్తించిన పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుటుంబానికి ఆధారంగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు మరణంతో ఆ తల్లిదండ్రుల రోదనలు అందరినీ కలచివేశాయి.
లారీ, బైక్ ఢీ.. యువకుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment