
విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
తాండూరు రూరల్: విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని న్యాయవాది జిలానీ సూచించారు. మంగళవారం పెద్దేముల్ మండలం గోట్లపల్లి మోడల్ స్కూల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాలకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేసి కేసుల పాలైతే ఉద్యోగాలు రావని తెలిపారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్‌కు సంబంధించిన చట్టాలు, శిక్షలను వివరించారు. గొడవలు, అనవసర విషయాలు, వ్యసనాల జోలికి వెళ్లకుండా.. జీవితాలను అందంగా మలచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గాయత్రి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
లెప్రసీపై సర్వే
దౌల్తాబాద్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో లెప్రసీ(కుష్టు) వ్యాధిపై వైద్యసిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కౌడీడ్, నర్సాపూర్ గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు సర్వే చేపట్టారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. వైద్యాధికారిని అమూల్య, సూపర్‌వైజర్ రఫీ సర్వే తీరును పరిశీలించారు. ఈ ఈనెల 30 వరకు అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
పరిగి: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన పట్టణ కేంద్రంలోని 1వ వార్డులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రంలోని ప్రేమ్‌నగర్ కాలనీలో నివాసముంటున్న సుగుణమ్మ పరిగి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. రోజువారీగా పనులకు వెళ్లగా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చేవరకు ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.75వేల నగదు కాలిబూడిదయింది.
ఉపాధి కల్పనకు కృషి
కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాల శేఖర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎల్మినేడులో లీడింగ్ ఎలక్ట్రానిక్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు 68 మంది దరఖాస్తు చేసుకోగా 52 మందిని స్పాట్ సెలక్షన్ చేశారన్నారు. త్వరలోనే మిగిలిన వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఎలక్ట్రానిక్ కంపెనీ డైరెక్టర్ ఉష, మేనేజర్ భారతి, కాంగ్రెస్ అధ్యక్షులు యాదగిరి, సీనియర్ నాయకులు జంగయ్య, సురేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment