
ముసుగు దొంగల హల్‌చల్
చేవెళ్ల: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ముగ్గురు దుండగులు మూడు గ్రామాల్లో హల్‌చల్ చేశారు. మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడి నగదు, ఓ బైక్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని సింగప్పగూడ, రామన్నగూడ, న్యాలట గ్రామాల్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. సింగప్పగూడలో శేఖర్‌రెడ్డి తన ఇంటికి తాళం వేసి శంషాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. గమనించిన దుండగులు తాళం పగులగొట్టి రూ.8 వేల నగదు ఎత్తుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన కుమ్మరి మహేందర్ ఇంటికి తాళం వేసి మరోగదిలో నిద్రించాడు. ఆయన పడుకున్న గదికి గడియ పెట్టి తాళం వేసిన ఇంట్లో రూ.6 వేల నగదు దోచుకెళ్లారు. న్యాలటకు చెందిన కానిస్టేబుల్ అశోక్ తన కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ ఇంట్లో చొరబడిన దొంగలు రూ.10 వేలు దొంగలించారు. సింగప్పగూడలో రంగారెడ్డి ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్‌తో పరారవుతుండగా మార్గమధ్యలో రామన్నగూడ వద్ద బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో ద్విచక్రవాహనం నిలిచిపోవడంతో అక్కడే వదిలేశారు. రామన్నగూడ గ్రామంలోకి వెళ్లి అక్కడ గ్రామానికి చెందిన షఫీ ఇంటి ఎదుట పార్కు చేసిన మరోబైక్‌తో పలాయనం చిత్తగించారు.
మూడు గ్రామాల్లో చోరీలు
నగదు, బైక్ ఎత్తుకెళ్లిన దుండగులు
సీసీ కెమెరాకు చిక్కిన దుండగులు
మూడు గ్రామాల్లో దొంగలు పడినట్లు గుర్తించిన గ్రామస్తులు గ్రామాల్లోని సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించారు. ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి చేతిలో కత్తులు, రాడ్‌లు పట్టుకుని వచ్చినట్లు గుర్తించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని పక్కింటి వారు లేచి బయటకురాకుండా చుట్టూ ఉన్న ఇళ్లకు గడియలు పెట్టి చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు మూడు గ్రామాల్లో క్లూస్‌టీంతో వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసుల దర్యాప్తు చేపట్టారు.

ముసుగు దొంగల హల్‌చల్
Comments
Please login to add a commentAdd a comment