యథేచ్ఛగా ఫిల్టర్ ఇసుక దందా
● మట్టిని శుద్ధి చేసి ఇసుకను తయారు చేస్తున్న అక్రమార్కులు ● చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీసు శాఖలు
పరిగి: నియోజకవర్గంలో రోజురోజుకూ నిర్మాణాలు పెరుగుతుండటంతో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇల్లు కట్టాలన్నా.. పరిశ్రమలు నెలకొల్పాలన్నా ఇసుక తప్పనిసరి. ప్రభుత్వ అనుమతితో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇసుకను కొనుగోలు చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఫిల్టర్ ఇసుక కొనుగోలుపై దృష్టి సారించారు. వాగులు, నదుల నుంచి సహజ సిద్ధంగా లభించే ఇసుక స్థానంలో ఫిల్టర్ ఇసుకను వాడుతున్నారు. కొంతమంది అక్రమార్కులు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. పరిగి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. కుల్కచర్ల, దోమ, పరిగి మండలాల్లో ఇసుక వ్యాపారం జోరుగా నడుస్తోంది. పరిగి పట్టణంతోపాటు ఇతర ప్రాంతాలకు బొంరాస్‌పేట్, యాలాల నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ విషయం పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
రాత్రి వేళ జోరుగా రవాణా
కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమ దందాతో జేబులు నింపుకొంటున్నారు. పరిగి పట్టణంలో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు టిప్పర్లను కొనుగోలు చేసి బొంరాస్‌పేట, యాలాల, తాండూరు వాగుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళ ఇసుకను తరలిస్తున్నట్లు తెలిసింది.
గ్రామీణ ప్రాంతాల్లో..
గ్రామీణ ప్రాంతాల్లో ఫిల్టర్ ఇసుక దందా జోరుగా సాగుతోంది. కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో ఫిల్టర్ ఇసుక కేంద్రాలను ఏర్పాటు చేశారు. మట్టిని శుద్ధి చేసి ఇసుకను తయారు చేయాలంటే నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మట్టిని శుద్ధి చేయడం ద్వారా వచ్చే ఇసుకను నిర్మాణాల్లో చేపడితే పటిష్టత ఉండదని నిపుణులు అంటున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా కొందరు ఫిల్టర్ ఇసుక తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
మచ్చుకు కొన్ని..
● కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో ఫిల్టర్ ఇసుకను ఎక్కువగా తయారు చేస్తున్నారు.
● పరిగి పట్టణానికి చెందిన కొంత మంది ఎలాంటి అనుమతులు లేకుండా పక్క మండలాల్లోని వాగుల నుంచి ఇసుక తెచ్చి విక్రయిస్తున్నారు.
● కుల్కచర్ల మండలం బొంరెడ్డిపల్లిలో ఫిల్టర్ ఇసుక జోరుగా సాగుతోంది. గ్రామ సమీపంలో ఫిల్టర్ ఇసుక కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిత్యం భారీగా విక్రయిస్తున్నారు. కుల్కచర్ల, దోమ మండలాలకు ఇక్కడి నుంచి ఫిల్టర్ ఇసుక సరఫరా అవుతోంది.
● గండిచెరువు, పుట్టపహాడ్, అనంత సాగర్, చాపలగూడెం, లాల్‌సింగ్ తండా, ఈర్లవాగుతండా, కుస్మసముద్రం, అంతారం గ్రామాల్లో ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేశారు.
● చౌడాపూర్ మండలం పాచ్చావ్‌తండా, చౌడాపూర్, వీరాపూర్, హనుమయ్యపల్లి, విఠాలాపూర్, లింగంపల్లి గ్రామాల్లో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది.
● దోమ మండలంలో దిర్సంపల్లి, దోర్నాల్‌పల్లి, బ డెంపల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో ఫిల్టర్ ఇసుక దందా యథేచ్ఛగా జరుగుతోంది.
● కుల్కచర్లలో రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.
అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు
అనుమతులు లేకుండా ఇసుక తరలించినా.. మట్టిని శుద్ధి చేసి ఇసుకను తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగినా, ఫిల్టర్ ఇసుక తయారు చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
– శ్రీనివాస్‌రెడ్డి, సీఐ, పరిగి
యథేచ్ఛగా ఫిల్టర్ ఇసుక దందా
Comments
Please login to add a commentAdd a comment