నిరాశే!
రాష్ట్ర బడ్జెట్‌లో సీఎం సొంత జిల్లాకు మొండిచేయి
● కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌పై సానుకూల ప్రకటన ● ఊసేలేని అనంతగిరి పర్యాటకం ● కోట్‌పల్లి ప్రాజెక్టుకు రిక్తహస్తం ● పాలమూరు ఎత్తిపోతల ప్రస్తావనే లేదు
వికారాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం ఈ ప్రాంత ప్రజలను నిరాశ పరిచింది. అనంతగిరి పర్యాటక అభివృద్ధికి.. కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు నిధులు కేటాయించలేదు. జిల్లా సాగునీటి వరప్రదాయినిగా భావించే పాలమూరు ఎత్తిపోతల పథకం ఊసే లేదు. గత బడ్జెట్ సమావేశాల్లో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న సీఎం ప్రస్తుత బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే తేలేదు. జిల్లాలోని జుంటుపల్లి, లఖ్నాపూర్, సర్పన్‌పల్లి తదితర ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోడం రైతులను నిరాశ పరిచింది. బుధవారం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై జిల్లా నేతల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని అధికార పక్షం అంటుండగా.. అంకెలగారడీ తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.
సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్ర బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భారీగా నిధులు కేటాయించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ఈ లెక్కన జిల్లాకు 14వేల ఇళ్లు మంజూరు కానున్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున జిల్లాకు రూ.700 కోట్ల నిధులు రానున్నాయి. అలాగే 1.30లక్షల మందికి గృహజ్యోతి పథకం అందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని 22 గురుకులాలకు సొంత భవనాలు సమకూరనున్నాయి. అయితే బీసీల సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించారని ఆ సంఘం నేతలు పెదవి విరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment