విద్యార్థీ.. విజయీభవ
రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు
● ఐదు నిమిషాలలోపు ఆలస్యానికి అనుమతి ● జిల్లాలో మొత్తం విద్యార్థులు 12,903మంది ● పరీక్ష కేంద్రాలు 69 ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
వికారాబాద్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం పరీక్ష కేంద్రాల్లో హాల్‌టికెట్ నెంబర్లు వేశారు. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. పరీక్షలు జరిగే సమయాల్లో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు, బెంచీలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 12,903మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,450 మంది బాలురు, 6,453 మంది బాలికలు ఉన్నారు. 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అనుకోని పరిస్థితులు ఎదురై ఐదు నిమిషాల లోపు(9.35 గంటలు) ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా..
గతంలో ఎన్నడూ లేని విధంగా కాపీయింగ్ కట్టడికి విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే ఇన్విజిలేటర్లను బాధ్యులను చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత సంఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల పర్యవేక్షణాధికారులతో నేరుగా సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్ వంటివి జరిగితే ఇన్విజిలేటర్లతో పాటు జిల్లా, మండల స్థాయి విద్యాధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీఈఓ రేణుకాదేవితోపాటు 69 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 69 మంది చీప్ సూపరింటెండెంట్లు, 20 మంది తహసీల్దార్లు, 20 మంది ఎంపీడీఓలు, 20 మంది ఎంఈఓలు పరీక్షలను పర్యవేక్షించనున్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు అందాయి.
అధికారులకు చాలెంజ్
పదో తరగతి పరీక్షలు జిల్లా విద్యాశాఖ తోపాటు ఉన్నతాధికారులకు చాలెంజ్‌గా మారింది. గతేడాది పది ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సారి ఆ అపఖ్యాతి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వొద్దు
తాండూరు రూరల్: పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వరాదని అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్‌కుమార్ ఆదేశించారు. బుధవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో తాండూరు పట్టణంలోని నంబర్ వన్‌పాఠశాలలో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించిన ఇద్దరు ఉద్యోగులపై వేటు పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించరాదని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ఏమైనా సంఘటనలు జరిగితే చీఫ్ సూపరింటెండెంట్లదే బాధ్యత అని స్పష్టం చేశారు.
అప్రమత్తంగా ఉండండి: డీఈఓ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో పరీక్షల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే ఉపాధ్యాయులను బాధ్యులను చేసి ఉద్యోగం నుంచి తొలగించేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ సీఐ సంతోష్‌కుమార్, తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి, ఎస్‌ఐలు శంకర్, గిరి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ సహకరించాలి
పదో తరగతి పరీక్ష కేంద్రా ల వద్ద పటిష్ట బందోబ స్తు ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రాలకు వచ్చే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా.. ఇతర అసౌర్యాలు కలిగినా వెంటనే డయల్ 100కు కాల్ చేయాలి. పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లరాదు. పరీక్షలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. విద్యార్థులందరికీ బెస్ట్‌ఆఫ్‌లక్
– నారాయణరెడ్డి, ఎస్పీ
ఆల్‌దబెస్ట్
ముందుగా పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ఆల్‌దబెస్ట్. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మౌలిక వసతులు కల్పించాం. ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పటిష్ట ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలి. మంచి ఫలితాలు సాధించి జిల్లాకు పేరు తేవాలి.
– ప్రతీక్‌జైన్, కలెక్టర్
విద్యార్థీ.. విజయీభవ
విద్యార్థీ.. విజయీభవ
Comments
Please login to add a commentAdd a comment