ఊపిరి తీస్తున్న ‘క్షయ’
● జిల్లాలో రెండేళ్లలో4,270 కేసులు నమోదు
● ఏటా పెరుగుతున్న టీబీ రోగులు
● జిల్లాలో కొరవడిన వైద్య సేవలు
● నగరంలోని గాంధీ, చాతి ఆస్పత్రులకు పరుగు
తాండూరు: క్షయ మనిషి ఊపిరి తీస్తోంది. కోరలు చాస్తున్న టీబీతో మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో అనంతగిరిలో టీబీ సానిటోరియం ఆస్పత్రి ద్వారా వ్యాధి గ్రస్తులకు వైద్య సేవలు అందించే వారు. ఆస్పత్రిని మూసి వేయడంతో జిల్లాలో టీబీ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. నేడు ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
నగరానికి పరుగు
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి టీబీ సానిటోరియం.. దశాబ్దాల కాలం పాటు వేలాది మంది వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను అందించి ఆరోగ్యంగా మార్చింది. దీంతో రోగుల పాలిట సంజీవని అనంతగిరి అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందింది. తర్వాత నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రభుత్వం పూర్తిగా సానిటోరియం.. సేవలను నిలిపి వేసింది. దీంతో జిల్లాలో టీబి వైద్య సేవలు అందించే ఆస్పత్రులు కరువయ్యాయి. వ్యాధి తీవ్రత అధికమైతే నగరంలోని గాంధీ, లేదా ఎర్రగడ్డలోని చాతి ఆస్పత్రికి రోగులు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతానికి జిల్లాలోని తాండూరు, కొడంగల్, వికారాబాద్, పరిగి, మర్పల్లి హాస్పిటల్‌లో టీబి నిర్ధారణ పరీక్షా కేంద్రాల ద్వారా వ్యాధి గ్రస్తులను గుర్తిస్తున్నారు. వ్యాధి సోకిన వారికి మందులు ఇచ్చిపంపిస్తున్నారు.
ఎలా సోకుతుంది
క్షయ క్రిముల వలన వ్యాపిస్తుంది. ఇతరులు ఎవరైనా దగ్గితే.. వారి నుంచి బ్యాక్టీరియా మరొకరికి సోకుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిన సమయంలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అంటు వ్యాధి కావడంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ టీబి బారిన పడే ప్రమాదం ఉంది. పూర్వికుల నుంచి సోకే వ్యాధి కాదు.
గాలి ద్వారా ఊపిరి తిత్తులకు
దగ్గు ద్వారా వ్యాపించే ప్రాణాంతకరమైన వ్యాధి క్షయ. ఇది గాలి ద్వారా ఊపిరి తిత్తులకు సోకుతుంది. అక్కడి నుంచి మెదడు, కిడ్నీ ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఊపిరి తిత్తులకు ఇన్ఫెక్షన్ వస్తుంది. దానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. మైక్రో బ్యాక్టీరియం, ట్యూబర్‌కులోసిస్ వ్యాధి సోకుతుంది. మద్యం ఎక్కువగా తీసుకునే వారికి, హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్న వారు త్వరగా క్షయ బారిన పడతారు. నివారణకు అందుబాటులో మందులు ఉన్నాయి. క్రమం తప్పకుండా వాడితే వ్యాధి నుంచి బయట పడవచ్చు.
27 నెలల్లో 4,250 కేసులు
జిల్లాలోని 20 మండలాల్లోని ప్రజలు అత్యధికంగా టీబి బారిన పడ్డారు. 2023లో 1,964 కేసులు, 2024లో 1,946, ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 340 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా.. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. గతేడాది ప్రతి నెల ఒక్కో రోగికి రూ.500 చెల్లించేది. ప్రస్తుతం గతేడాది నవంబర్ నుంచి రూ.1,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో వ్యాధిగ్రస్తులు ఏటా ముగ్గురు మరణిస్తున్నారు.
అవగాహన పెంచుతున్నాం
క్షయ వ్యాఽధిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. వ్యాధి సోకిన వారికి అధికంగా దగ్గు రావడం, రాత్రి జ్వరం, తెమడతో కూడిన దగ్గు, నోట్లో నుంచి రక్తం పడటం జరుగుతుంటుంది. అలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
–డాక్టర్,రవీంద్రనాయక్,డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
ఊపిరి తీస్తున్న ‘క్షయ’
ఊపిరి తీస్తున్న ‘క్షయ’
Comments
Please login to add a commentAdd a comment