యాలాల: మండలంలోని కోకట్ పరిధిలో గల సర్వే నంబరు 60/40లోని ఎకరా అసైన్డ్ భూమిలో 60 ఏళ్లుగా కాస్తులో ఉన్నామని, భూ విషయంలో కొందరు గొడవ చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఆదివారం పట్టాదారు మహమూదాబేగం, ఆమె కుమారుడు సర్వర్ మాట్లాడుతూ.. అసైన్డ్ భూమి తాత మహబూబ్‌సాబ్, బడేసాబ్‌ల నుంచి తమకు వారసత్వంగా అందిందని తెలిపారు. భూమిని సాగు చేస్తున్నామని చెప్పారు. 2005లో రాజీవ్ స్వగృహ కోసం భూములు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు సూచించినా, నిరాకరించామని పేర్కొన్నారు. మా భూమి పక్కనే రెవెన్యూ అధికారులు ఆటోనగర్‌కు స్థలం కేటాయించారని, రక్షణగా మా భూమికి కంచె వేసుకున్నామని వెల్లడించారు. భూమికి సంబంధించిన పాస్‌బుక్, పహాణీలను రెవెన్యూ అధికారులకు అందజేశామని చెప్పారు. అయినా కొందరు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇదే విషయంలో హైకోర్టును ఆశ్రయించామని, ఇక నుంచైనా తమపై వేధింపులు ఆపాలని కోరారు.