
ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు
అనంతగిరి: ౖరెతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తేమ లేని వడ్లను మిల్లులకు తెచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 11 కేంద్రాలు సన్న రకం వడ్ల కోసం, 117 దొడ్డు రకాలు కొనుగోలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సుమారు 1,90,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వరి, 10,000 మెట్రిక్ టన్నుల సన్న రకం వరి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో ధ్యానం కొనుగోలుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి కేంద్రం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ధరలు, తేమ శాతం తదితర వివరాలు పొందుపరచాలని ఆదేశించారు. కేంద్రాల్లో తేమ శాతం కొలిచే పరికరాలు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైతులకు తాగునీటి వసతి ఉండేలా చూసుకోవాలన్నారు. చెక్ పోస్టుల వద్ద రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లయ్ సిబ్బందిని నియమించి పొరుగు రాష్ట్రాల నుంచి వడ్లు రాకుండా చూడాలన్నారు. ముందుగా రైతులకు టోకెన్లు ఇచ్చి ఏ రోజు ధాన్యం తేవాలో చెప్పాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు లారీలను సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. నాణ్యమైన సీఎంఆర్ రైస్‌ను అందజేయాలని మిల్లర్లకు సూచించారు. 2023–24 సంవత్సరం రబీకి సంబంధించిన బియ్యాన్ని కూడా వెంటనే అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్‌ఓ మోహన్‌బాబు, సివిల్ సప్లయ్ డీఎం వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి సారంగపాణి, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, బాలేశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్