
నిలువ లేక.. నీరసించి
నవాబుపేట: పని ప్రదేశాల్లో నిలువ నీడ కరువయిందని గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలు గగ్గోలు పెడుతున్నారు. మండుటెండల్లో రెక్కలు ముక్కలు చేసుకొని పని చేస్తున్నా కనీస వసతులు లేవని వాపోతున్నారు. జిల్లాలో 1.86 లక్షల జాబ్ కార్డులు ఉండగా ప్రస్తుతం 23,105 మంది కూలీలు పని చేస్తున్నారు. నవాబుపేట మండలంలో 8826 జాబ్ కార్డులు ఉండగా ఆరు వేలకు పైగా కూలీలు ఉపాధి పొందుతున్నారు.
మండుటెండల్లో పనులు
ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటలు అయ్యిందంటే బయటికి వెళ్లడానికి జనాలు జంకుతున్నారు. మండలంలోని చించల్‌పేట, మమ్మదాన్‌పల్లి, ఎక్‌మామిడి, నవాబుపేట, చిట్టిగిద్ద, అక్నాపూర్ తదితర గ్రామాల్లో సుమారు 6 వేల మందిపైగా కూలీలు మండటెండల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనులు చేస్తూ అలసిపోతున్నారు. సేదతీరేందుకు ఎలాంటి సదుపాయాలు లేక అస్వస్థతకు గురవుతున్నారు.
రెండు నెలలుగా నిలిచిన వేతనాలు
ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో అందరూ ఉపాధిహామీ పనులకు వస్తున్నారు. గత జనవరిలో చేసిన పనికి మాత్రమే కూలీ డబ్బులు ఖాతాల్లో జమచేయగా.. ఫిబ్రవరి, మార్చి నెలలో పని చేసిన వాటికి డబ్బులు రాలేదని మదన పడుతున్నారు. దీనిపై ఉపాధిహామీ అధికారులు సంప్రదిస్తే.. చేసిన పనులకు సంబంధించి మస్తర్లు జనరేట్ చేసి మెమోలు జారీ చేశామని, ప్రభుత్వం కూలీల డబ్బులు విడుదల చేస్తే నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని తెలుపుతున్నారు.
నిబంధనలు గాలికి
నిబంధనల ప్రకారం పనులు ఉపాధి పనుల జరుగుతున్న ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలి. ప్రాథమిక చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అందులో అయోడిన్, కాటన్, బ్యాండేజ్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. ఎండ నుంచి రక్షణ కోసం టెంట్లు వేయాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇవి ఎక్కడా కనిపించవు. కూలీల పిల్లల ఆలనా పాలన కోసం ఆయాలను ఏర్పాటు చేయాలి. సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని శ్రమజీవులు ఆరోపిస్తున్నారు. రోజు వారీ వేతనం రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాఽధి పని ప్రదేశాల్లో కనిపించని సౌకర్యాలు
మండుటెండల్లో విలవిలల్లాడుతున్న కూలీలు
పట్టించుకోని అధికార యంత్రాంగం

నిలువ లేక.. నీరసించి