
రేపు 108లో ఇంటర్వ్యూలు
అనంతగిరి: ఈఎంఆర్‌ఐ 108లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం సోమవారం వికారాబాద్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా 108 సేవల ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ, ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏ. జీఎన్‌ఎం, బీఎస్సీ(బీజడ్‌సీ) చేసిన వారు అర్హులన్నారు. పట్టణంలోని మిషన్ ఆస్పత్రి ఆవరణలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సెల్ నంబర్ 9154041953, 9703958721లలో సంప్రదించాలని సూచించారు.
ధాన్యం సేకరణసజావుగా సాగాలి
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
దౌల్తాబాద్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ పీఏసీఎస్ సిబ్బందికి సూచించారు. శనివారం దౌల్తాబాద్, యాంకి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల వద్ద రైతులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎంత మేర ధాన్యం సేకరించారని ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గాయత్రి, పీఏసీఎస్ సీఈఓ అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
ముదిరాజ్‌లను బీసీ – ఏలోకి మార్చాలి
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్
దౌల్తాబాద్: ముదిరాజ్‌లను బీసీ – డీ నుంచి బీసీ – ఏలోకి మార్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్ కోరారు. శనివారం మండల కేంద్రంలోని చెన్నకేశవ ఫంక్షన్ హాల్‌లో మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్‌లకు అత్యఽధిక స్థానాలు కేటాయించేలా ఆయా పార్టీలను కోరారు. ప్రతి నియోజకవర్గంలో ముదిరాజ్‌లకు హాస్టల్, కమ్యూనిటీ భవనాలు నిర్మించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు కూర వెంకటయ్య, హన్మంతు, రెడ్డి శ్రీనివాస్, వెంకట్రాములు, అడ్వకేట్ వెంకటయ్య, నర్సప్ప, నర్సింలు, ఆశప్ప, కృష్ణ, మహిపాల్, మల్కరాజ్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల పొలాలను పరిశీలించిన అడ్వకేట్ కమిషన్
దోమ: మండలంలోని ఐనాపూర్‌కు చెందిన ఇద్దరి రైతుల పొలాలను శనివారం పరిగి కోర్టు అడ్వకేట్ కమిషన్ ఆనంద్ గౌడ్ పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇద్దరి రైతులకు పక్కపక్కనే పొలాలు ఉన్నాయి. వీరికి హద్దు సమస్య ఉంది. సర్వే చేసి సమస్యను పరిష్కరించాలని ఇరువురూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు అడ్వకేట్ కమిషన్ ఆనంద్ గౌడ్‌ను నియమించింది. ఆయన ఇద్దరి రైతుల తరఫున ఇద్దరు సీనియర్ అడ్వకేట్లు బి.వెంకట్‌రెడ్డి, గౌస్‌పాషాతో పొలాలను పరిశీలించారు. ఎవరూ ఆందోళన చెందరాదని ఇద్దరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

రేపు 108లో ఇంటర్వ్యూలు