
నటుడు సుమన్‌కు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్న ధర్మకర్త శర్మ
తల్లిదండ్రులు, గురువును మించిన దైవం లేదు
50 పడకల ఆస్పత్రి శంకుస్థాపనలో సినీ నటుడు సుమన్
నాతవరం : దైవ సంకల్పంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని సినీ నటుడు సుమన్ అన్నారు. మండలంలోని చిక్కుడుపాలెం గ్రామంలో గల శ్రీశివశక్తి క్షేత్రంలో ధర్మకర్త కె.ఎన్.ఎన్.శర్మ ఆధ్వర్యంలో సోమవారం 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి సుమన్ శంకుస్థాపన చేశారు. సుమన్‌కు వేదపండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ.3 కోట్ల వ్యయంతో 85 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించే 50 పడకల ఉచిత ఆస్పత్రి నిర్మాణానికి సుమన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శివుడి ఆజ్ఞ లేనిదే మానవుడు ఏమీ చేయలేడన్న అపారమైన నమ్మకం శివభక్తుడిగా తనకు ఉందన్నారు. ఈ రోజు తనకు చైన్నెలో అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చానంటే శివుడి ఆజ్ఞే కారణంగా భావిస్తున్నానన్నారు. తాను హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లో ఉండగా శివాలయం ధర్మకర్త శర్మ ఉచిత ఆస్పత్రి నిర్మిస్తున్నామని, శంకుస్థాపనకు రా వాలని ఆహ్వానించారన్నారు. మారుమూల ప్రాంత ప్రజలకు ఉచిత వైద్యం అందించే మంచి కార్యక్రమానికి తన వంతు తోడ్పడాలని నిర్ణయించుకున్నాను అన్నారు. తన స్నేహితులు, సినిమా పరిశ్రమలో ఉన్న శివభక్తుల దృష్టికి ఈ ఆస్పత్రి విషయం తీసుకెళ్లి వారి ఆశీస్సులు కోరతానన్నారు. విదేశాల్లో ఉన్న వారు సైతం ఇలాంటి సేవా కార్యక్రమాలపై దృిష్టి సారించాలంటే సెలబ్రిటీలు ఇలాంటి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలన్నారు. ప్రతి వ్యక్తి దైవం లాంటి తల్లిదండ్రులు, గురువులను మరిచిపోకూడదన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో భక్తిభావం అధికమని, అందువల్లే ఇక్కడ యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఉక్రెయిన్, రష్యా వంటి దేశాల్లో యుద్ధాల కారణంగా ప్రతి రోజు మరణాలు నమోదు అవుతున్నాయన్నారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, అందువల్ల ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు.
750 సినిమాల్లో నటించాను..
తాను సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి 46 ఏళ్లు అయిందన్నారు. ఇంత వరకు వివిధ భాషల్లో 750 సినిమాల్లో నటించానన్నారు. తెలుగులో 100 సినిమాల్లో హీరోగా నటించానని, తమిళంలో 50 సినిమాలు, కన్నడ తదితర భాషల్లో నటించానన్నారు. తెలుగు సినిమాల్లో అన్నమయ్య సినిమా జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిందన్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో 8 నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉంటూ చెప్పులు వేసుకోకుండా ప్రతిరోజు చన్నీళ్ల స్నానం చేశానన్నారు. దైవ స్మరణతో గడిపేవాడినని తెలిపారు. ఆ సినిమాతో శ్రీ వేంకటేశ్వస్వామిపై ఎనలేని భక్తిభావం పెరిగిందన్నారు. అన్నమయ్య సినిమా చూసిన అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ తనను ఢిల్లీ పిలిపించుకుని కలిసి టిఫిన్ చేశారన్నారు. తనను ఘనంగా సత్కరించి పంపించారన్నారు. అది సినిమా పరిశ్రమలో ప్రత్యేకత సంతరించుకునేలా చేసిందన్నారు. సినిమా పరిశ్రమలో ఎలాంటి సపోర్టు లేదన్నారు. పన్నెండేళ్ల వయసులో నేర్చుకున్న కరాటే కష్ట సమయంలో ఆత్మస్థైర్యం అందించిందన్నారు. శివుడు, శ్రీవేంకటేశ్వస్వామిని పూజిస్తానన్నారు. ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం శివశక్తి క్షేత్రం భూగర్గంలో గల శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ధర్మకర్త, వేదపండితులు సుమన్‌ను ఘనంగా సత్కరించారు. సుమన్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆయన వెంట నర్సీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వెలగా నారాయణరావు, వినాయక ఆలయ కమిటీ చైర్మన్ దేవత సురేష్, అరుణ, వర్ధమాన నటులు సతీష్, రాము తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment