రుచీ లేదు.. శుచీ లేదు..! | - | Sakshi
Sakshi News home page

రుచీ లేదు.. శుచీ లేదు..!

Published Tue, Feb 25 2025 1:00 AM | Last Updated on Tue, Feb 25 2025 12:59 AM

రుచీ

రుచీ లేదు.. శుచీ లేదు..!

● అధ్వానంగా మధ్యాహ్న భోజనం ● బడిభోజనం తినేందుకు ఇష్టపడని విద్యార్థులు ● ఇళ్ల నుంచి బాక్సులు తెచ్చుకుంటున్న వైనం ● పాఠశాలలపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ కరువు

విశాఖ విద్య : బడి భోజనం నాణ్యత లోపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణ అధ్వానంగా తయారైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పేరైతే మార్చేశారని కానీ క్షేత్రస్థాయిలో దీని అమలుపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ సరిగా లేకపోవటంతో బడి పిల్లలకు అర్ధాకలి తప్పడం లేదు. కోడిగుడ్లు కుళ్లిన వాసన వస్తుండటంతో వాటిని తీసుకునేందుకు విద్యార్థులు ఇష్టపడటం లేదు. ముక్కిన బియ్యం సరఫరా చేస్తుండటంతో.. అన్నం రుచీ శుచీ లేక విద్యార్థులు తినడం మానేస్తున్నారు. చాలా మంది విద్యార్థులు ఇళ్ల నుంచే బాక్సులు తెచ్చుకుంటున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలయ్యే జిల్లాలోని ఏ స్కూల్‌కు వెళ్లి చూసినా ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది.

అంతా అంకెల గారడీ

జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని 581 పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరం ఎండీఎం యాప్‌లో నమోదైన సోమవారం నాటి గణాంకాల మేరకు 71,858 మంది విద్యార్థులకు బడిలో మధ్యాహ్న భోజనం అందించేలా బడ్జెట్‌ కేటాయింపులు చేస్తున్నారు. వీటిలో 338 స్కూళ్లలోని సుమారు 47 వేల మంది విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భోజనం సరఫరా చేస్తున్నారు. సోమవారం జిల్లాలో 59,490 మంది విద్యార్థులు బడికి హాజరు కాగా, వీరిలో 57,950 విద్యార్థులు భోజనం తీసుకున్నట్లు ఎండీఎం యాప్‌లో నమోదైంది. ఈ లెక్కన బడికి హాజరైన వారిలో 97.4 శాతం మంది విద్యార్థులు భోజనం తింటున్నారనేది అధికారులు లెక్కలు చెబుతున్నాయి. కానీ సగం మందికిపైగా విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి బాక్స్‌లు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇదేదో తేడాగా ఉంది

మాధవధార హైస్కూల్‌ను సోమవారం మధ్యాహ్న భోజనం సమయంలో ‘సాక్షి’ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ 610 మంది విద్యార్థులు ఎన్‌రోల్‌మెంట్‌ ఉండగా 609 మంది బడికి హాజరైనట్లు నమోదు చేశారు. వీరంతా మధ్యాహ్న భోజనం తిన్నట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. కానీ ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్సుల్లో భోజనం తింటూ కనిపించారు. అలాగే పలువురు విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఇంకా తినాల్సి ఉండగా ఈలోగానే కూర అయిపోయింది. దీంతో కేవలం బిర్యానీ మాత్రం వడ్డించారు. గుడ్లు కుళ్లిన వాసన వస్తుండటంతో చాలా మంది వీటిని తీసుకోలేదు. ఒక్క మాధవధార స్కూల్లోనే కాదు, జిల్లాలోని ఏ స్కూల్లో చూసినా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ లేదనడానికి ఇదే నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పేరుకే మెనూ మార్పు

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పరిస్థితి దృష్ట్యా ఇక్కడి విద్యార్థుల ఆహారపు అలవాట్లు మేరకు మెనూలో మార్పులు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. నూతన మెనూ ట్రైల్‌ రన్‌ తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ నెల 19న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సోమవారం వైట్‌ రైస్‌, ఆకు కూరపప్పు, ఉడికించిన గుడ్లు, చిక్కీ పెట్టాలి. కానీ అన్ని స్కూల్లో గత మెనూ మేరకు వెజిటబుల్‌ బిర్యానీ పెట్టారు. పేరుకే మెనూ మార్పు తప్ప క్షేత్రస్థాయిలో దీని అమలుపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని దీని ద్వారా తేటతెల్లమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
రుచీ లేదు.. శుచీ లేదు..!1
1/4

రుచీ లేదు.. శుచీ లేదు..!

రుచీ లేదు.. శుచీ లేదు..!2
2/4

రుచీ లేదు.. శుచీ లేదు..!

రుచీ లేదు.. శుచీ లేదు..!3
3/4

రుచీ లేదు.. శుచీ లేదు..!

రుచీ లేదు.. శుచీ లేదు..!4
4/4

రుచీ లేదు.. శుచీ లేదు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement