
నేటి నుంచి పీ–4 సర్వే
గేట్ల దగ్గర నుంచి గెట్ అవుట్
● మరోసారి స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు
మహారాణిపేట: పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ–4 సర్వేను శనివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుందని శుక్రవారం పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా పది సూత్రాల్లో ప్రథమంగా పేదరిక నిర్మూలన,పేదరికం లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో పీ–4 సర్వేకు రూపకల్పన చేశామన్నారు. 27 ప్రశ్నలతో కూడిన హౌస్ హోల్డ్ సర్వేను గ్రామ సభల్లో కూడ ప్రవేశ పెడతారని, లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామ సభల ద్వారా జరుగుతుందన్నారు. పీ4 సర్వేకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు, సూచనలను, నిర్దేశిత క్యూర్ కోడ్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కలెక్టర్ కోరారు.
పారదర్శకంగా సర్వే నిర్వహించాలి
తగరపువలస: రైతులకు ఇబ్బంది లేకుండా పారదర్శకంగా రైతులు రీ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన ఆనందపురం మండలం గొట్టిపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా రీ సర్వే జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. డ్రోన్, రోవర్ ద్వారా రీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. రీ సర్వే పంట ప్రక్రియలను పరిశీలించారు. సర్వే పూర్తయిన తరువాత గ్రామసభ నిర్వహించి రైతులకు పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. గొట్టిపల్లి గ్రామ సచివాలయంతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన వెంట సర్వే విభాగం ఏడీ సూర్యారావు, తహశీల్దార్ శ్యాంప్రసాద్, ఎంపీడీవో జానకి తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ మళ్లీ మొదలైందని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం విధులకు వెళ్లిన కాంట్రాక్ట్ కార్మికులు ఆయా ప్రవేశ గేట్ల వద్ద బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం ప్రయత్నించినప్పటికి వీలు కాలేదు. సుమారు 250 మంది కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు కాకపోవడంతో సాంకేతిక సమస్య అనుకున్నారు. తీరా కార్మిక సంఘాల నాయకులు వాకబు చేయగా వారిని బయోమెట్రిక్ నుంచి తొలగించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలియవచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం మేరకు తొలగింపు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ జరుగుతున్నట్టు సమాచారం. ఈ అంశంపై విభాగంలోని అధికారులను వివిధ సంఘాల నాయకులు ప్రశ్నించగా తమకు ఏం తెలియదంటూ దాట వేశారని ఆరోపించారు. ఈ అంశంపై పోరాటానికి సన్నద్ధమవుతున్నామని కార్మిక నాయకులు తెలిపారు.
28న విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికలు
విశాఖ లీగల్ :
ప్రతిష్టాత్మకమైన విశాఖ న్యాయవాదుల సంఘం నూతన వార్షిక ఎన్నికలు ఈనెల 28వ తేదీన జరుగుతాయని సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయవాది జి.ఎం. రెడ్డి నియమితులయ్యారు. 15 రోజులు ముందు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇప్పటికే వివిధ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. న్యాయవాదులందరూ ఓటు హక్కు పొందడానికి తక్షణమే తమ సభ్యత్వ రుసుము చెల్లించాలని సంఘం కార్యదర్శి డి.నరేష్ కోరారు. ప్రధానంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష,కార్యదర్శి పదవులకు గట్టి పోటీ ఉంది. 12 లేదా 13 తేదీల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment