ఇద్దరిపై కూలిన విద్యుత్ స్తంభం
● విశాఖ డెయిరీ జంక్షన్ వద్ద వేచి ఉండగా ఘటన ● ఒకరి పరిస్థితి విషమం
అక్కిరెడ్డిపాలెం: ప్రమాదం ఎప్పుడు, ఎలా వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు మన ప్రమేయం లేకున్నా ఆ ప్రమాదానికి బాధితులం అవుతాం. మంగళవారం విశాఖ డెయిరీ జంక్షన్‌లో వేచి ఉన్న ఇద్దరిపై విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలను మార్చడంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి..
జాతీయ రహదారిపై తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలు కూలుతున్నా.. జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల కిందట విశాఖ డెయిరీ జంక్షన్‌లో విద్యుత్ స్తంభం కూలిపోగా, అక్కడే విధుల్లో ఉన్న కమ్యూనిటీ గార్డు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. తాజాగా మరో స్తంభం కూలి ఇద్దరిపై పడిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ఆటోనగర్ నుంచి షీలానగర్ వైపు ఆర్టీసీ బస్సు వస్తోంది. విశాఖ డెయిరీ ఎదురుగా జంక్షన్ వద్దకు వచ్చేసరికి జీవీఎంసీ విద్యుత్ స్తంభం నుంచి వెళ్తున్న తీగ బస్సు టాప్‌కు తగలడంతో ఇరుక్కుపోగా, బస్సు లాక్కొని పోయింది. దీంతో తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం విరిగి నేలకొరిగింది. అదే సమయంలో భెల్ ప్రవేశ గేటు వైపు నుంచి విశాఖ డెయిరీ వైపు రోడ్డు దాటడానికి బైక్‌పై వేచి ఉన్న బొత్స కామేశ్వరరావు, పక్కనే నిల్చొని ఉన్న దొడ్డి సత్యవతిపై ఆ విద్యుత్ స్తంభం పడింది. తీవ్ర గాయాల పాలైన కామేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. సత్యవతికి తలకు తీవ్ర గాయం కావడంతో షీలానగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కె.కోటపాడు, వారాడ సంతపాలేనికి చెందిన కామేశ్వరరావుకు విశాఖ డెయిరీలో పని కుదిరింది. మొదటి రోజు పనికి వెళ్లేందుకు వచ్చి ఇలా ప్రమాదానికి గురికావడం పలువురిని తీవ్రంగా కలచివేసింది. తల్లితో కలిసి అతను నివసిస్తున్నట్లు బంధువులు తెలిపారు. 69వ వార్డు నాతయ్యపాలేనికి చెందిన సత్యవతి అనకాపల్లిలో ఉంటున్న తన కుమార్తెను చూడటానికి వెళ్లేందుకు పళ్లు కొనుగోలు చేసింది. అనంతరం విశాఖ డెయిరీ వైపు రోడ్డు దాటడానికి వేచి ఉండగా ప్రమాదానికి గురైంది. కాగా.. జరిగిన ప్రమాదం ట్రాఫిక్ పరిధిలోకి వస్తుందా లేదా లా అండ్ ఆర్డర్ పరిధిలోకి వస్తుందా అనే సందిగ్ధతతో పోలీసులు సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదు.
ఇద్దరిపై కూలిన విద్యుత్ స్తంభం
ఇద్దరిపై కూలిన విద్యుత్ స్తంభం
Comments
Please login to add a commentAdd a comment