అప్పన్న పెళ్లిచూపులు నేడు
● కొండదిగువ ఉద్యాన మండపంలో డోలోత్సవం ● బొట్టెనడిగే పున్నమి ఉత్సవంగా అడవివరం ప్రజల ఆచారం
సింహాచలం: పాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం పెళ్లి చూపులు జరగనున్నాయి. స్వామి పెళ్లికుమారుడిగా ముస్తాబై సింహగిరి దిగి, కొండ దిగువ పుష్కరిణి సత్రంలో ఉన్న ఉద్యానమండపంలో కొలువుండి, డోలోత్సవం నిర్వహించుకోనున్నాడు. పెళ్లి నిశ్చయం అనంతరం అడవివరం గ్రామంలో తిరువీధి చేసుకోనున్నాడు. అనంతరం పైడితల్లి ఆలయం వద్దకు కెళ్లి, అక్కడి నుంచి మెట్లమార్గంలో కొండకి చేరుకుంటాడు.
డోలోత్సవం కథ ఇదీ..
సింహాచలేశుడికి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి రోజు వార్షిక కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. దీనికి ముందు వచ్చే పాల్గుణ పౌర్ణమి రోజున స్వామివారి పెళ్లిచూపుల తంతుతో డోలోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. దీన్నే అడవివరం గ్రామస్తులు బొట్టెనడిగే పున్నమిగా చెప్తారు. అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారిని స్వామికి అక్కగా అభివర్ణిస్తుంటారు. పైడితల్లి అమ్మవారి కుమార్తెనే స్వామి మనువాడినట్లు చెప్తారు. సింహగిరిపై నుంచి కొండదిగువకు వచ్చిన స్వామి తొలుత తన సోదరి పైడితల్లి ఆలయం వద్దకు వెళ్లి పిల్లనివ్వాల్సిందిగా అమ్మవారిని అడగ్గా.. నీకు ఆస్తిపాస్తులేం ఉన్నాయని, ఏం చూసి పిల్లనివ్వాలని అమ్మవారు తొలుత ఒప్పుకోరు. దీంతో స్వామి అలిగి అక్కడి నుంచి వెళ్లి, పుష్కరిణి సత్రంలోని ఉద్యాన మండపంలో వేంచేస్తాడు. అక్కడ వైభవంగా డోలోత్సవం, వసంతోత్సవం, చూర్ణోత్సవం చేసుకుంటాడు. ఈ వేడుక గురించి తెలుసుకున్న పైడితల్లి అమ్మవారు స్వామికి ఎంతో మంది భక్తులు ఉన్నారని, వారే ఆయన ఆస్తిగా భావించి పిల్లనివ్వడానికి ఒప్పుకుంటుంది. స్వామికి పెళ్లి నిశ్చయమైన ఆనందంలో గ్రామస్తులు, భక్తులు, దేవస్థానం ఉద్యోగులు, వైదికులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని వసంతోత్సవం జరుపుతారు. దీన్నే డోలోత్సవంగా అభివర్ణిస్తారు. డోలోత్సవం నిర్వహణ అనంతరం ఉగాది రోజున పెళ్లిరాట, చైత్రశుద్ధ ఏకాదశిన వార్షిక కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ఆధ్వర్యంలో వైదికులు,అధికారులు ఏర్పాట్లు చేశారు. కొండదిగువ ఉద్యానవనమండపాన్ని విశేషంగా ముస్తాబు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment