ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆరిలోవ : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు తెలిపారు. విశాలాక్షినగర్ బీవీకే జూనియర్ కళాశాలలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఏపీయూఎస్) ఉత్తరాంధ్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకీకృత విధానం, సీపీఎస్ రద్దు, పాత పింఛన్ విధానం అమలు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు ఉపాధ్యాయుల సమస్యలు తీర్చలేదన్నారు. ఐఆర్ ప్రకటించకపోవడం, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర క్షోభకు గురవుతున్నారని తెలిపారు. సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సీహెచ్.శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ శాశ్వత బదిలీ చట్టంలో లోపాలను సవరించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టాలన్నారు. డీఎస్సీ ఖాళీలన్నింటినీ బదిలీల్లో చూపించాలని తెలిపారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశా రు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తమ్మినేని ఆనందరావు, సహాయ కార్యదర్శి చిన్ని శ్రీనివాస్, ఇ.రామునాయుడు, జె.రామునాయుడు, శ్రీనివాసరావు, అప్పారావు పాల్గొన్నారు.
ఏపీయూఎస్ జిల్లా కార్యదర్శిగా విశ్వనాథం
విశాఖ విద్య : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అక్కయ్యపాలెం ఎన్‌జీవోస్ కాలనీ చెందిన తెలుగు ఉపాధ్యాయుడు ఎం.ఎన్.వి విశ్వనాథం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కోశాధికారిగా పద్మనాభం మండలానికి చెందిన కనకల సన్యాసినాయుడు, నగర అధ్యక్షుడిగా సుదర్శన పట్నాయక్, నగర ప్రధాన కార్యదర్శిగా దొరబాబు నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రవణ్‌కుమార్, ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కార్యదర్శి చిన్ని శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్, జిల్లా పర్యటన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా మహిళా కన్వీనర్ రామలక్ష్మి తదితరులు కమిటీ నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.