26 తర్వాత.. సమ్మె? | - | Sakshi
Sakshi News home page

26 తర్వాత.. సమ్మె?

Published Fri, Mar 21 2025 1:04 AM | Last Updated on Fri, Mar 21 2025 1:01 AM

26 తర్వాత.. సమ్మె?

26 తర్వాత.. సమ్మె?

ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపు వివాదం ముదురుతోంది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధులు మౌనం వహించడం గమనార్హం.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకునే ప్రయత్నం చేయాల్సింది పోయి.. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తన చర్యలతో మరింత దిగజార్చేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలోని ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్లతో పోల్చి చూపిస్తూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో శాశ్వత, కాంట్రాక్ట్‌ కార్మికులు అధికంగా ఉన్నారనే సాకుతో వేలాది మంది ఉద్యోగుల మెడపై తొలగింపు కత్తి పెట్టింది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం ద్వారానే ప్లాంట్‌కు భవిష్యత్‌ ఉంటుందని స్టీల్‌ప్లాంట్‌ పర్యటనలో కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్‌ పౌండ్రిక్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉద్యోగులను ఇతర ప్లాంట్లకు డిప్యూటేషన్‌పై పంపడం, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(వీఆర్‌ఎస్‌) ద్వారా సుమారు 2,500 మందిని తగ్గించడం, దాదాపు 3,000 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. గత ఏడాది సెప్టెంబర్‌ 30న ఒకేసారి 3,000 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించేందుకు ప్రయత్నించింది. అయితే కార్మిక సంఘాల తీవ్ర ఆందోళనల ఫలితంగా ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత వీఆర్‌ఎస్‌కు సుమారు 1,130 మంది ఉద్యోగులు దరఖాస్తు చేయగా.. ప్రభుత్వం ఆమోదించింది.

ఆర్‌ఎల్‌సీ ఆదేశాలు బేఖాతర్‌

తాజాగా, కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపును మళ్లీ తెరపైకి తెచ్చింది యాజమాన్యం. ఇందులో భాగంగా గతంలో రెన్యువల్‌ చేయాల్సిన పలు కాంట్రాక్ట్‌లను నిలిపివేయడంతో దాదాపు 644 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ చర్యను నిరసిస్తూ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘాలు గత నెల 20న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ నెల 7 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. దీంతో గత నెల 25న ప్రాంతీయ కార్మిక కమిషనర్‌(ఆర్‌ఎల్‌సీ) సమక్షంలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తొలగించిన 644 మంది కార్మికుల జాబితాను ఇవ్వాలని ఆర్‌ఎల్‌సీ.. స్టీల్‌ యాజమాన్యాన్ని కోరారు. ఈ క్రమంలో ఈ నెల 5న దాదాపు 288 మంది కార్మికుల బయోమెట్రిక్‌ను ఆన్‌లైన్‌లో నిలిపివేయడంతో కార్మిక సంఘాలు మళ్లీ ఆర్‌ఎల్‌సీకి ఫిర్యాదు చేశాయి. ఈ నెల 11న జరిగిన సమావేశంలో ఆపివేసిన బయోమెట్రిక్‌ను 15వ తేదీలోగా పునరుద్ధరించాలని ఆర్‌ఎల్‌సీ సూచించారు. యాజమాన్య ప్రతినిధులు దీనికి అంగీకరించినప్పటికీ బయోమెట్రిక్‌ పునరుద్ధరణ జరగలేదని కార్మి క నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా.. కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపునకు వ్యతిరేకంగా ఈ నెల 7న బీసీ గేటు వద్ద మానవహారం జరిగింది. ఈ నెల 9న గాజువాకలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ నెల 18న ఈడీ(వర్క్స్‌) బిల్డింగ్‌ వద్ద ఆందోళన చేశారు. 26న జరగనున్న ఆర్‌ఎల్‌సీ సమావేశంలో యాజమాన్యం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే సమ్మెకు వెళ్తామని నాయకులు ప్రకటించారు.

ప్రజాప్రతినిధుల మౌనం

స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటించామని గొప్పలు చెప్పుకున్న స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కార్మికుల తొలగింపుపై మౌనం వహించడం గమనార్హం. ఈ అంశాన్ని ఎంపీ, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఉక్కు మంత్రిత్వశాఖకు చెప్పి తొలగింపు ఆపే ప్రయత్నాలు చేయడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమ్మె జరిగితే..

ప్రస్తుతం రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మంచి ఉత్పత్తిని సాధిస్తున్న తరుణంలో కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మె చేస్తే ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ప్లాంట్‌కు ఇది మరింత నష్టం కలిగిస్తుంది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం తమ మొండి వైఖరిని వీడి, కాంట్రాక్ట్‌ కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగానే తొలగింపు

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగానే కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపు చేపట్టారు. ఒకవైపు ప్లాంట్‌లో ఉత్పత్తి పెరుగుతుంటే కార్మికులను తొలగించడం అన్యాయం. తద్వారా ఉన్న వారిపై పనిభారం పెరుగుతుంది. యాజమాన్యం మొండికేస్తే సమ్మె చేయడం ఖాయం.

–జి.శ్రీనివాసరావు, అధ్యక్షులు, సీఐటీయూ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం

కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపు అన్యాయం

స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపుపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు మూడు ఫర్నేస్‌లను నడుపుతామని యాజమాన్యం చెబుతూ.. మరోవైపు కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగిస్తుండటం దుర్మార్గం. ఈ చర్యను వెంటనే ఆపకపోతే నిరవధిక సమ్మెకు దిగుతాం.

– మంత్రి రవి, ప్రధాన కార్యదర్శి,ఏఐటీయూసీ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం

స్టీల్‌ప్లాంట్‌లో ముదురుతున్న కాంట్రాక్ట్‌ కార్మికుల వివాదం

ఆర్‌ఎల్‌సీ సమావేశంపై అందరి చూపు

సానుకూల నిర్ణయం రాకపోతే సమ్మె: నాయకుల ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement