కనీస పెన్షన్ కోసం దేశవ్యాప్త ఉద్యమం
గాజువాక: విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ.7,500, డీఏ, మరో పక్క హయ్యర్ పెన్షన్ కోసం దేశవ్యాప్త ఉద్యమం నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ నేషనల్ ఏజిటేషన్ కమిటీ జాతీయ నాయకుడు కమాండర్ అశోక్ రావత్ తెలిపారు. వైజాగ్ నేషనల్ ఏజిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో గాజువాకలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలం పాటు తమ సేవలను అందించి రిటైరైన ఉద్యోగులకు కనీస పెన్షన్, డీఏతోపాటు రెండు హెల్త్ కార్డులను కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఒక పక్క కనీస పెన్షన్ కోసం పోరాడుతూనే మరోపక్క హయ్యర్ పెన్షన్ కోసం కూడా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అందరూ సమైక్యంగా పని చేస్తే హక్కులను సాధించుకోగలుగుతామన్నారు. దీనిపై ఇప్పటికే పీఎఫ్ సెంట్రల్ కమిటీతో మాట్లాడినట్టు చెప్పారు. వెయ్యి రూపాయల పెన్షన్ తీసుకుంటున్న అనేక మంది విశ్రాంత ఉద్యోగులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారన్నారు. నేషనల్ ఏజిటేషన్ కమిటీ అధ్యక్షుడు బాబూరావు మాట్లాడుతూ కనీస పెన్షన్ కోసం అవసరమైతే పీఎఫ్ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామన్నారు. కార్యదర్శి ఎ.వి.ఎన్.ఎం.అప్పారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేస్తోందన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.రామారావు మాట్లాడుతూ ఈ విషయంపై పార్టీలకతీతంగా ఉద్యమం చేపట్టాలన్నారు. ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు డి.ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేస్తోందని, ఏ వర్గానికీ ఉపయోగపడటం లేదన్నారు. ఐఎన్‌టీయూసీ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ పెన్షన్ పోరాటంలో అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నేషనల్ ఏజిటేషన్ కమిటీ ప్రతినిధులు సరితా నార్కడ్, శోభా అరసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment