
అప్పన్న కల్యాణం చూతము రారండి
రాత్రి 8.15 నుంచి రథోత్సవం.. 10.30 నుంచి కల్యాణమహోత్సవం
సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని సింహగిరిపై వేంజేసిన శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణమహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరగనుంది. సోమవారం రాత్రి నుంచే కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద అర్చకులంతా రుత్విగ్వరణం, ఉత్సవాంగీకారం జరిపి, చక్రపెరుమాళ్లను పల్లకీలో ఉంచి మాడవీధిలో తిరువీధి నిర్వహించారు. తదుపరి పుట్టబంగారు మండపంలో చక్రపెరుమాళ్లను వేంజేపచేశారు. పుట్టమన్ను ఉంచి మృత్సంగ్రహణాన్ని జరిపారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ పుట్టమన్నుని శిరస్సుపై పెట్టుకుని వేదమంత్రోశ్చరణలు, నాదస్వర వాయిద్యాల మద్య ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. తదుపరి కల్యాణమండపంలో ఏర్పాటుచేసిన పాలికల్లో పుట్టమన్నుని వేసి అంకురార్పణను విశేషంగా నిర్వహించారు.
నేటి మధ్యాహ్నం నుంచి కల్యాణ ఘట్టాలు
స్వామివారి కల్యాణోత్సవ ఘట్టాలను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కొట్నాలు ఉత్సవంతో ప్రారంభిస్తారు. సాయంత్రం 6.30 నుంచి ఎదురుసన్నాహోత్సవం జరుపుతారు. అనంతరం స్వామిని, అమ్మవార్లను రథంపై వేంజేపచేసి రాత్రి 8.15గంటల నుంచి సింహగిరి మాడ వీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 10.30 నుంచి ఆలయ ఉత్తరరాజగోపురం ఎదురుగా ఏర్పాటుచేసిన భారీ వేదికపై వార్షిక కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
రథోత్సవానికి సన్నద్ధం
రథోత్సవానికి సంబంధించి సోమవారం రథాన్ని సిద్ధం చేశారు. తొలుత జాలారి పెద్ద, రథసారథి కదిరి లక్ష్మణరావు, దేవస్థానం వైదికులు రథానికి పూజలు నిర్వహించారు. అనంతంం ఎస్‌బీటీ గేటు దగ్గర నుంచి రాజగోపురం వద్దకు రథాన్ని తెచ్చారు.
దర్శనాలపై ఆంక్షలు
వార్షిక కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు మాత్రమే అప్పన్న మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి. తిరిగి రాత్రి 8.30 నుంచి 10 వరకు దర్శనాలకు అనుమతిస్తారు. కార్యక్రమాల్లో దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు, ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, ఈఈ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ త్రిమూర్తులు, మాజీ ట్రస్ట్‌బోర్డు సభ్యుడు గంట్ల శ్రీనుబాబు, పలువురు మత్స్యకారులు, భక్తులు పాల్గొన్నారు.

అప్పన్న కల్యాణం చూతము రారండి