
బాలికపై వీధి కుక్కల దాడి
సింథియా: జీవీఎంసీ 62వ వార్డు పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ అధికమవుతోంది. తాజాగా పదేళ్ల బాలికను కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. వార్డు పరిధి ప్రకాష్‌నగర్, హైస్కూల్‌కు ఎదురుగా ఉన్న వీధిలో పూజశ్రీ తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. స్థానిక జీవీఎంసీ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం తన ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో మూడు వీధి కుక్కలు బాలికను చూసి పెద్దగా అరిచాయి. దీంతో భయాందోళన చెందిన జయశ్రీ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. వీధికుక్కలు ఆమెను వెంబడించి దాడి చేశాయి. ఆ చిన్నారి పెద్దగా కేకలు పెట్టడంతో.. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆ కుక్కలను అక్కడి నుంచి తరిమివేశారు. కుక్కల దాడిలో ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలవ్వగా, తల్లిదండ్రులు చికిత్స కోసం కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు ఆ చిన్నారికి చికిత్స అందించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వీధి కుక్కలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.