
దుర్వినియోగం
రూ.6 కోట్ల నిధులు
నలుగురు వరుణ్ బజాజ్ ఉద్యోగుల అరెస్ట్
అక్కిరెడ్డిపాలెం: ఆర్థిక మోసం కేసులో ప్రమేయం ఉన్న వరుణ్ గ్రూప్ బజాజ్ విభాగంలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను గాజువాక పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ ఎ.పార్ధసారథి తెలిపిన వివరాలు.. కస్టమర్ల ఆడిట్ విభాగం, అంతర్గత విజిలెన్స్ నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రారంభించిన దర్యాప్తులో నిందితులు ఎక్స్చేంజ్ వాహనాలకు సంబంధించి రూ.6 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలిందన్నారు. కొన్ని సంవత్సరాలుగా కంపెనీకి రావాల్సిన నిధులు స్వాహా చేసినట్లు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వ్యక్తుల్లో గాజువాక బ్రాంచ్ ఏరియా సేల్స్ మేనేజర్ బి.చంద్రశేఖర్, గాజువాక రూరల్ డీలర్ షిప్ ఏరియా జనరల్ మేనేజర్ వడ్డాది అప్పారావు, చోడవరం ఏరియా సేల్స్ మేనేజర్ పి.నారాయణమూర్తి, మాకవరపాలెం బ్రాంచ్ మేనేజర్ కె.రాజా ఉన్నట్లు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. అదనపు చర్యలు, మోసం తీవ్రత నిర్ణయించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.