జగన్‌ అంటే నమ్మకం..చంద్రబాబు ఒక అబద్ధం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ అంటే నమ్మకం..చంద్రబాబు ఒక అబద్ధం

Published Wed, May 31 2023 2:58 AM | Last Updated on Sat, Feb 3 2024 5:52 PM

విలేకరులతో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు  - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

చీపురుపల్లి: ప్రజల కోసం మాట ఇస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబెట్టుకుంటాడనే నమ్మకం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలకు ఉంటే..మాట చెబితే అది అబద్ధమే తప్ప ఎన్నటికీ ఆచరణలోకి రాదనే అభిప్రాయం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై ప్రజలకు ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు చీపురుపల్లి పట్టణంలోని లావేరురోడ్‌లో గల వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 2019 మే 30న నవరత్నాలు సంక్షేమ పథకాల ఫైలుపై తొలి సంతకం చేశారని, నాలుగేళ్లుగా సంక్షేమ పాలన దిగ్విజయంగా కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకంతో రాష్ట్రంలో 151 అసెంబ్లీ స్థానాలు, విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో ప్రజలు గెలిపించారన్నారు. అదే నమ్మకంతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని చెప్పారు. సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి కల్పన, సాగునీటి వనరులు, మౌలిక వసతులు అభివృద్ధితో బాటు పేదలు అభ్యున్నతి కోసం కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. పేదలకు సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా ఫ్యామిలీ డాక్టర్‌ పేరుతో నేరుగా ఇంటికే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలోనే అన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మూలపేట పోర్టు నిర్మాణానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారని మరో మూడేళ్లలో వాటి సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. విశాఖపట్నంలో గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాటు చేసి రూ.13.5 లక్షలు కోట్లు పెట్టుబడులను ఆకర్షించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అవినీతి రహిత, పారదర్శక పరిపాలనకు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా డీబీటీ విధానం ద్వారా 2.5 లక్షల కుటుంబాల ఖాతాల్లో సంక్షేమ పథకాల డబ్బులు జమ చేయడం నిదర్శనంగా నిలుస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకుల త్యాగాలతో 2024లో 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు..

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా చంద్రబాబు పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే విమర్శలు చేసిన చంద్రబాబునాయుడు అధికార దాహంతో టీడీపీ మహానాడులో అన్నీ ఉచితమే అంటూ ఆల్‌ ఫ్రీ బాబుగా మారిపోయాడన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలపై ఇటు ప్రజలు, అటు సొంత పార్టీ నేతలతో బాటు సోషల్‌ మీడియాలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని స్పష్టం చేశారు. 2019 నుంచి ఇంతవరకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కులం, పార్టీ, మతం, జెండా చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకం అందించారని, ఈ విషయంలో టీడీపీ కార్యకర్తలు గుండెలపై చేయి వేసుకుని నిర్థారణ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలాస నియోకవర్గ వైఎస్సాన్‌సీపీ పరిశీలకుడు కేవీ.సూర్యనారాయణరాజు, మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ మంగళగిరి సుధారాణి, చీపురుపల్లి, మెరకముడిదాం, గుర్ల మండలాల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, కోట్ల వెంకటరావు, తాడ్డి వేణు, పొట్నూరు సన్యాసప్పలనాయుడు, బెల్లాన బంగారునాయుడు, తోట తిరుపతిరావు, పతివాడ రాజారావు, కరిమజ్జి శ్రీనివాసరావు, ఇప్పిలి గోవింద, బాణాన శ్రీనివాసరావు, బాణాన రమణ తదితరులు పాల్గొన్నారు.

నాలుగేళ్లలో 98.5 శాతం హమీలు అమలు చేసిన సీఎం జగన్‌

ప్రతిపక్ష నేతపై ప్రజల్లో లేని విశ్వసనీయత

అధికారం కోసం ఆల్‌ ఫ్రీ బాబుగా మార్పు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement