వనపర్తి టౌన్: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దైవంగా భావించి పిల్లలు వారికి సేవ చేయాలని.. ఎవరైనా నిరాశ్రయులను చేస్తే హెల్ప్‌లైన్ నంబర్ 14567కు ఫిర్యాదు చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కనీస అవసరాలు తీర్చకపోయినా, ఇళ్లలో స్థానం కల్పించకపోయినా సీనియర్ సిటిజన్ చట్టం 2007 ప్రకారం రూరల్ డెవలప్‌మెంట్ అధికారి వారికి పిల్లల నుంచి నెలకు సరిపడా డబ్బులు ఇప్పించాలని చెప్పారు. రూ.10 వేల వరకు మెయింటెనెన్స్ కోరవచ్చని, మెయింటెనెన్స్ ఫిర్యాదు ఇవ్వొచ్చని సూచించారు. పిల్లలు లేనివారి ఆస్తి తదనంతరం ఎవరికి చెందుతుందో వారి ద్వారా, దత్తత తీసుకున్న పిల్లల నుంచి కూడా మెయింటెనెన్స్ కోరే అవకాశం ఉందన్నారు. న్యాయ సలహాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 15100ను సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ అసిస్టెంట్ కౌన్సిల్ ఎం.రఘు, జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, మండల సీనియర్ ఫోరం అధ్యక్షుడు నాగేంద్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.