సాక్షిప్రతినిధి, వరంగల్: శాసనమండలి కంటే శాసనసభే బాగుంటుందని అధికార పార్టీ ఎమ్మెల్సీలు పలువురు ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో దూకుడు మరింత పెంచారు. ఎమ్మెల్యేగా ఎన్నికై తే కీలక పదవులు పొందవచ్చని కొందరు, ఎమ్మెల్సీ అయితే ప్రతి కార్యక్రమానికీ ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉండాల్సి వస్తోందని, ఏ నియోజకవర్గం తమది కాకుండా పోతోందని మరికొందరు.. ఇలా పలు కారణాలతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే శాసనసభకు ఎన్నికలు రానుండడంతో ఎమ్మెల్సీల వ్యూహాలు, ప్రయత్నాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య అంతర్గత విబేధాలు సైతం రోజురోజుకూ రాజుకుంటున్నాయి.
శాసనసభవైపు ఎమ్మెల్సీల చూపు...
ఉమ్మడి వరంగల్ నుంచి మండలిలో ఉన్న పలువురు ఎమ్మెల్సీలు అసెంబ్లీపై కన్నేశారు. ప్రధానంగా స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి ఈ సమస్య ఉత్పన్నం కాగా, ప్రస్తుతం డోర్నకల్, జనగామ, భూపాలపల్లి నియోజకవర్గాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా డాక్టర్ టి.రాజయ్య ఉండగా, ఇక్కడినుంచి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి, సీనియర్ నేత డీఎస్ రెడ్యానాయక్ వ్యవహరిస్తుండగా, ఎమ్మెల్సీ, మంత్రి సత్యవతిరాథోడ్ పేరు ప్రచారంలో ఉంది. గండ్ర వెంకటరమణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గంనుంచి శాసనసభ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కూడా టికెట్ ఆశిస్తున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇటీవల ప్రత్యర్థులు పెరుగుతున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రయత్నంలో ఉన్నారన్న ప్రచారం మొదట జరగ్గా, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం నియోజకవర్గంలో కీలకంగా తిరుగుతున్నారు. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాల్లో కొద్ది రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య మాటలు మంటలు రేపుతుండగా.. ఒకరిపై ఒకరు స్వరం పెంచుతుండటం గులాబీ బాస్‌కు తలనొప్పిగా మారుతోంది.
ఆ నాలుగు సెగ్మెంట్లలో అగాథం...
► స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు టి.రాజయ్య, కడియం శ్రీహరిల మధ్య పంచాయితీ తారస్థాయికి చేరుకుంది. 2019లో మొదలైన వైరం నిన్నటి ఆత్మీయ సమావేశాల వరకు.. పరస్పర ఆరోపణలు మంటలు రేపుతున్నాయి. ఆత్మీయ సమావేశాలకు ఎమ్మెల్సీకి సమాచారం ఇవ్వడం లేదని కడియం శ్రీహరి బహిరంగ వ్యాఖ్యలు చేయగా, సమాచారం ఇస్తున్నామంటూ ఎమ్మెల్యే రాజయ్య ముక్తాయింపు ఇచ్చారు. కానీ ఇద్దరు కలిసి పాల్గొన్నది లేదు.
► జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి సొంతపార్టీ నుంచి సెగ ఎక్కువైంది. ఎమ్మెల్సీగానే ఉంటానని పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించినా.. ఇటీవల భువనగిరి నుంచి మూడోలైన్ పొడిగించి ఎంఎంటీఎస్ రైలును జనగామ వరకు నడపాలని లేఖ రాయడం చర్చనీయాంశమైంది. మరోవైపు జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురం గ్రామంలో స్థానిక జెడ్పీటీసీ భర్త వెంకట్‌రెడ్డి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన బావమరిది గుజ్జా సంపత్ రెడ్డిల అండదండలతో కురుమలపై దాడులకు పూనుకుంటున్నాడని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం బహిరంగ ఆరోపణలు చేశారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ మల్లేశం సంఘ విద్రోహులకు మద్దతుగా ఉన్నారని, ఎమ్మెల్సీగా ఉండి ఒకే వర్గంవైపు మాట్లాడటం సరైంది కాదని కౌంటర్ ఇచ్చారు.
► డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్.. మంత్రి సత్యవతి రాథోడ్‌ల మధ్య పోరు ఉధృతమైంది. శుక్రవారం సీరోలులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్, ఆయన కుమారుడు రవిచంద్ర, ఎంపీ కవితలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికి కుట్ర చేస్తున్నారని పరోక్షంగా మంత్రి సత్యవతి రాథోడ్, ఆమె వర్గంపై చేసిన విమర్శలు దుమారం రేపుతున్నాయి.
► భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఎదురీత తప్పేలా లేదు. కాంగ్రెస్ నుంచి గెలిచి అఽధికార పార్టీలో చేరిన గండ్ర రమణారెడ్డి తన భార్యను వరంగల్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ను చేసుకోగలిగారు. అయితే ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఆయన వర్గం నేతలతో మాత్రం కలిసిమెలిసి ఉండలేకపోతున్నారు. మాజీ స్పీకర్ చారి, రమణారెడ్డిల మధ్య పెరుగుతున్న దూరం భూపాలపల్లి అధికార పార్టీలో ఆధిపత్య పోరును పెంచుతోంది.
Comments
Please login to add a commentAdd a comment