
సాక్షిప్రతినిధి, వరంగల్: భారతీయ జనతా పార్టీ సంస్థాగత మార్పులు ఆ పార్టీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. రాష్ట్ర పార్టీలో మారిన పరిణామాలు ఉమ్మడి వరంగల్‌లో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిని ఉలికిపాటుకు గురిచేశాయి. నిన్నటిదాకా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పొరుగు జిల్లాకు చెందిన బండి సంజయ్‌కుమార్ వ్యవహరించగా... ఆయనతో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఆశావహులు సత్సంబంధాలు కొనసాగించారు.
ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్‌లో పాలు పంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టికెట్ ఖాయమనుకుంటుండగా.. బండి సంజయ్ మార్పు ఆశావహులను ఉలికిపాటుకు గురిచేసింది. ఈఅనూహ్య పరిణామాలను ఊహించని పలువురు ‘బండి’ ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో పడగా.. కిషన్‌రెడ్డి వర్గీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
(చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు?)
రాష్ట్ర కమిటీలో పలువురు సీనియర్లు.. మార్పులేని జిల్లా కమిటీలు
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా 2020 మార్చిలో పదవీ బాధ్యతలు తీసుకున్న సమయంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర కమిటీలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన సీనియర్లు ఉన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డాక్టర్ జి.విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డికి అవకాశం దక్కింది. ప్రేమేందర్‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా మూడోసారి నియమితులు కాగా.. రాకేశ్‌రెడ్డికి రెండోసారి చాన్స్ వచ్చింది.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన హుస్సేన్ నాయక్‌ను బీజేపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. వీరు మూడేళ్లపాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. ఇదే సమయంలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలిగా రావు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సుమారు మూడేళ్లుగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఉన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు యుగందీశ్వర్, ములుగుకు చింతలపూడి భాస్కర్‌రెడ్డి ఉండగా, జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఆరుట్ల దశమంతరెడ్డి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వి.రాంచందర్‌రావు వ్యవహరిస్తున్నారు. ఏడాదిగా కొత్త జిల్లా కమిటీలు వేస్తారని ప్రచారం జరిగినా... వారినే బండి సంజయ్ కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుత సమయంలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరగ్గా.. జిల్లా రాష్ట్ర, జిల్లా కమిటీల్లోనూ మార్పులు ఉండవచ్చన్న చర్చ కూడా పార్టీలో సాగుతోంది.
టికెట్‌ల కేటాయింపులో ఇక ఈటలే కీలకం..
బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇక ఉమ్మడి వరంగల్‌లో పార్టీ టికెట్ల కేటాయింపులో కీలకం కానున్నారు. ఈయన బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరారు. బీఆర్‌ఎస్ సీనియర్ కన్నెబోయిన రాజయ్య, మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతి కాషాయం కండువా కప్పుకున్నారు. మరికొందరు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలతో మంతనాలు జరిపిన ఆయన ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.
ఇంతకాలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య ఉన్న విభేదాల కారణంగా ఉమ్మడి వరంగల్‌లో రెండు గ్రూపులు పని చేశాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ 12 నియోజకవర్గాల నుంచి ఆశావహులుగా ఉన్న వారికి భరోసా ఇస్తూ వచ్చారు. ఇదే సమయంలో ఆ పార్టీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించడంతో ఉమ్మడి వరంగల్ నుంచి టికెట్‌లు ఆశిస్తున్న పలువురిని ఆందోళనలో పడేసింది. దీంతో కొందరు ‘బండి’ ముద్రను తొలగించుకునే ప్రయత్నంలో పడ్డారు.
ఎక్కడినుంచి ఎవరు..
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కుసుమ సతీశ్, గంట రవికుమార్ తదితరులు ప్రయత్నం చేస్తుండగా, వరంగల్ పశ్చిమ నుంచి రావు పద్మ, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మార్తినేని ధర్మారావు ఉన్నారు.
పరకాల నుంచి మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి, జి.ప్రేమేందర్‌రెడ్డి పేర్లు వినిపిస్తుండగా.. ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున పేరు కూడా ప్రచారంలో ఉంది.
వర్ధన్నపేట నుంచి కొండేటి శ్రీధర్, మహబూబాబాద్ నుంచి జాటోతు హుస్సేన్‌నాయక్ పేర్లుండగా.. నర్సంపేట నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, జనగామ నుంచి దశమంతరెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి, కేవీఎల్‌ఎన్ రెడ్డి తదితరుల పేర్లున్నాయి.
భూపాలపల్లి కన్నం యుగందీశ్వర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎరుకల గణపతి, నిశిధర్‌రెడ్డి, చదువు రాంచంద్రారెడ్డి, చాడ రఘునాథరెడ్డి, ములుగు నుంచి భూక్య రాజునాయక్, ఆజ్మీరా కృష్ణవేణి నాయక్ తదితరులున్నారు.
పాలకుర్తి, డోర్నకల్, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కూడా పలువురు ఆశావహులుగా మారిన పరిణామాల నేపథ్యంలో టికెట్ల వేటలో కొత్తదారులు వెతకడంలో పడ్డారు.
(చదవండి: ముచ్చటగా మూడోసారి.. మరోసారి పగ్గాలు అప్పగించింది అందుకేనా?)
Comments
Please login to add a commentAdd a comment