అటవీప్రాంతంలో కాలినడకన వెళుతున్న వైద్యులు, సిబ్బంది
బుట్టాయగూడెం: ఒకప్పుడు సంపన్న వర్గాలకే పరిమితమైన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు సామాన్యులకు చేరువైంది. ప్రతి పేదవాడికీ మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య సేవల్లో నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో వైద్యులే ఇంటికి వచ్చి సేవలందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ ఫ్యామిలీ డాక్టర్ గిరిజన ప్రాంత ఆదివాసీ గిరిజనులకు వరంగా మారింది. గతంలో మారుమూల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న కొండరెడ్డి గిరిజనులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే కొండలు, గుట్టలు దాటుకుంటూ మైళ్ల దూరం కాలినడకన అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునేవారు. ఇప్పడు ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైద్యులే కాలినడకన నడుచుకుంటూ కొండలు, గుట్టలు దాటుకుంటూ గ్రామాల్లో గిరిజనుల ఇళ్లకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంటి వద్దకే వెళ్లి డాక్టర్లు వైద్య సేవలు అందించాలనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంపై కొండరెడ్డి గిరిజనులు అభినందించి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇంటి వద్దకే డాక్టర్, సిబ్బంది
అనారోగ్యంతో బాధపడుతూ నడవలేక మంచానికే పరిమితమైన వారు, పక్షవాతంతో ఉన్నవారు, ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతిలో ఉన్నవారు, నిండు గర్భిణులు, చిన్న పిల్లల వద్దకు డాక్టర్, ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం ఇతర వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. మందులు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే ఎవరికై నా అత్యవసర వైద్య సేవలు అవసరమైతే అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గ పరిధిలో సుమారు 500 మంది గర్భిణులు, 408 మంది బాలింతలు, 1200 మంది జ్వరపీడితులు, సుమారు 2వేల చిన్నారులు, అలాగే 3,800 మందికిపైగా హిమోగ్లోబిన్ టెస్ట్‌లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
గ్రామస్థాయిలోనే వైద్య సేవలు
గ్రామ స్థాయిలోనే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించే విధంగా ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకువచ్చింది. ఇది మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు ఎంతో వరమనే చెప్పాలి. వైద్యులు, సిబ్బంది పల్లెలకు వెళ్లి ప్రాథమికంగా అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మేరీ కేథరిన్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ, కేఆర్‌పురం, బుట్టాయగూడెం మండలం
రోగులకు ఎంతో ఉపయోగకరం
ఆస్పత్రులకు వెళ్లకుండా గ్రామాల్లోకే అన్ని రకాల రోగాలకు వైద్యులు ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించడం దేశ చరిత్రలోనే ఎక్కడాలేదు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టి పటిష్టంగా అమలయ్యేలా కృషి చేస్తున్నారు. వైద్యులు, సిబ్బందే కాలినడకన గిరిజన గ్రామాలకు వెళ్ళి వైద్యసేవలు అందించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.
– తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం
Comments
Please login to add a commentAdd a comment