భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద అర్హులందరికీ స్థలాలను మంజూరు చేయడంతో పాటు ఇళ్ల నిర్మాణాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. వందలాది ఎకరాలను సేకరించి జగనన్న లేఅవుట్‌లుగా తీర్చిదిద్ది మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అలాగే సొంత స్థలంలో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా చేయూత అందిస్తున్నారు.
దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 630 లేఅవుట్లలో ఇళ్ల నిర్మా ణాలు వేగంగా జరుగుతున్నాయి. అలాగే సొంత స్థలం కలిగిన వారు ప్రభుత్వ సాయంతో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే వేలాది మంది గృహప్రవేశాలు కూడా పూర్తిచేసుకున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోని పచ్చమీడియా ఇళ్ల నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది.
1,531 ఎకరాల్లో 630 లేఅవుట్లు
ప్రభుత్వం జిల్లాలో 1,531.308 ఎకరాలను సేకరించి 630 లేవుట్‌ల్లో పేదలకు స్థలాలను మంజూరు చేయడంతో పాటు సొంత స్థలంలో నిర్మాణాల కింద మొత్తంగా 72,059 ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే 25,402 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా సుమారు 24 వేల మంది గృహప్రవేశాలు కూడా పూర్తిచేశారు. మిగిలిన 1,402 ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు తుది మెరుగులు దిద్దుకుంటున్నారు. అలాగే శ్లాబ్ పూర్తయినవి 1,513, శ్లాబ్ దశలో 2,025, ప్రాథమిక దశలో 34,376 ఇళ్లు పలు దశల్లో ఉన్నాయి. ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకూ సుమారు రూ.400 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.
ప్రత్యేక శ్రద్ధతో అధికారులు
కలెక్టర్ పి.ప్రశాంతి జగనన్న లేవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తరచూ హౌసింగ్, మున్సిపల్ అధికారులతో సమీక్షిస్తూ ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఇసుక బల్క్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 10 వేల నుంచి 20 వేల టన్నుల వరకు ఇసుక నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి వారికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్నారు. అలాగే జగనన్న కాలనీల్లో తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్, అంతర్గత రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు.
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం
సీఎం జగన్ ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుని ఈ ఏడాది జనవరిలో గృహప్రవేశం చేశాం. మా లేఅవుట్‌లో చాలా మంది ఇళ్లు కట్టుకుంటున్నారు. కాలనీలో విద్యుత్ సౌకర్యం కల్పించారు. రోడ్లు వేస్తున్నారు. సొంతింటి కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం.
– బాలం భాగ్యలక్ష్మి, విస్సాకోడేరు లేఅవుట్
8 నెలల క్రితమే గృహప్రవేశం
నాకు దగ్గులూరు లేవుట్‌లో ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు నిర్మాణానికి రుణ సాయం కూడా చేశారు. దీంతో నేను ఇల్లు కట్టుకుని 8 నెలల క్రితమే గృహప్రవేశం చేశాను. నా సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేశారు. మా లేఅవుట్‌లో నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి.
– చుండూరి చిననాగమ్మ, దగ్గులూరు లేఅవుట్
25,402 ఇళ్లు పూర్తి
జిల్లాలో ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు 25,402 ఇళ్లు పూర్తికాగా వేలాది ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. జగనన్న లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సరఫరా చేయడానికి బల్క్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం.
మండలాల వారీగా ఇళ్ల నిర్మాణాలు
మండలం మంజూరు పూర్తయినవి
ఆచంట 2,508 1,189
పెనుగొండ 3,528 1,180
పెనుమంట్ర 3,350 1,299
పోడూరు 2,832 1,222
భీమవరం 1,798 859
భీమవరం అర్బన్ 3,266 285
వీరవాసరం 1,557 747
మొగల్తూరు 2,261 1,261
నరసాపురం అర్బన్ 4,841 426
నరసాపురం 2,925 897
పాలకొల్లు 1,298 858
పాలకొల్లు అర్బన్ 2,503 219
యలమంచిలి 2,914 1,319
పెంటపాడు 2,324 1,222
తాడేపల్లిగూడెం 3,628 1,814
తాడేపల్లిగూడెం అర్బన్ 3,547 1,113
అత్తిలి 2,478 861
ఇరగవరం 2,563 1,163
తణుకు 4,175 1,141
తణుకు అర్బన్ 6,118 643
ఆకివీడు అర్బన్ 1,342 262
ఆకివీడు 2,278 555
కాళ్ల 1,078 724
పాలకోడేరు 2,380 833
ఉండి 2,904 1,202
గణపవరం 1,663 876
– పి.ప్రశాంతి, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment