మెరుగైన వైద్య సేవలందించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఏ ఒక్కరూ అనారోగ్యం కారణంగా అప్పులపాలు కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వ వైద్యులు బాధ్యతాయుతంగా సేవలందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం స్థానిక త్యాగరాజు కల్యాణ మండపంలో వైద్యారోగ్యశాఖ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ఆయా శాఖల పనితీరు, లక్ష్యాలను సమీక్షించారు. లక్ష్యాలు చేరుకోని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులకు పోషకాహారం అందిస్తే ఆరోగ్యవంతమైన శిశువులు జన్మిస్తారని తద్వారా ఆరోగ్య సమాజం ఏర్పడుతుందన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతినెలా ఐదు డెలివరీలు ఉండాలని, అవుట్, ఇన్ పేషెంట్ల సంఖ్య పెంచాలన్నారు. మూడేళ్లు నిండిన ప్రతి చిన్నారినీ అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి విద్యాబుద్ధులతో పాటు ఆటపాటలను నేర్పించాలన్నారు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే పేద రోగులను ఆప్యాయంగా పలకరించాలన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉంటూ సేవలందించడం ద్వారా నమ్మకం పెరుగుతుందన్నారు. డీఎంహెచ్‌ఓ డి.మహేశ్వరరావు, ఐసీడీఎస్ అధికారి బి.సుజాతా రాణి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి దేవ సుధాలక్ష్మి, జిల్లా ఇన్‌చార్జి మలేరియా అధికారి ఎం.గులాబ్ రాజకుమార్, ఎన్టీఆర్ వైద్య సేవల కో–ఆర్డినేటర్ ఎస్.కీర్తి కిరణ్, వైద్యాధికారులు, అంగన్‌వాడీ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ నాగరాణి
Comments
Please login to add a commentAdd a comment