రైతన్నకు మిర్చి గొట్రు | - | Sakshi
Sakshi News home page

రైతన్నకు మిర్చి గొట్రు

Published Mon, Feb 24 2025 12:32 AM | Last Updated on Mon, Feb 24 2025 12:32 AM

రైతన్నకు మిర్చి గొట్రు

రైతన్నకు మిర్చి గొట్రు

2023లో రూ.25 వేలు.. నేడు రూ.13 వేలు

సన్నరకం మిర్చి క్వింటాలు ధర 2023లో రూ.25 వేలు పలకగా ప్రస్తుతం రూ.13 వేలకు పడిపోయింది. క్వింటాల్‌కు 341 రకం రూ.12,500 నుంచి రూ.13,500, నంబర్‌–05 రకం రూ.13 వేల నుంచి రూ.14,500, బేడికి రకం రూ.15 వేల నుంచి రూ.16 వేలు, తేజ రకం రూ.12,500 నుంచి రూ.13 వేలు ఉంది. దేశవాళీ లావు రకాలు మాత్రమే క్వింటాల్‌ రూ.38 వేల నుంచి రూ.42 వేల వరకు పలుకుతున్నాయి. గత సీజన్‌తో పోలిస్తే ఎండు మిర్చి పండించే విస్తీర్ణం తగ్గినా దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. సన్న రకాలు ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు లావు రకాలు పది క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఎండు మిర్చి ధరలు ఆశాజనకంగా ఉంటాయని భావించిన వ్యాపారులు పెద్ద మొత్తంలో శీతల గిడ్డంగుల్లో సరుకును నిల్వ చేశారు. కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానం వల్ల గుంటూరు, ఖమ్మం, వరంగల్‌ ప్రాంతాలతో పాటు జిల్లాలో మిర్చి నిల్వలు చేసిన వ్యాపారులు సుమారు రూ.2 వేల కోట్ల వరకు నష్టపోయినట్టు మార్కెట్‌ వర్గాల అంచనా.

తాడేపల్లిగూడెం : ఎండు మిరపకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నాయి. ధర పెరుగుతుందనే ఆశతో ఇప్పటికే నిల్వలు చేసిన వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. చీడపీడల నివారణకు అధిక వ్యయం కావడంతో రైతులకు పెట్టుబడులు పెరిగినా గిట్టుబాటు ధర మాత్రం లేదు. రెండేళ్ల క్రితం ఇదే సీజన్‌లో ఎండు మిర్చి పండించిన రైతుల పంట పండింది. అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రైతుల లోగిళ్లు సంతోషాలతో నిండాయి. అదే ఉత్సాహంతో ఈ ఏడాది ఎండు మిర్చి పంట వేసిన రైతులు కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో కుదేలయ్యారు. ఈ సీజన్‌లో ఇటు జిల్లాలో దేశవాళీ రకాలు, అటు తె లంగాణ ప్రాంతంలో మిగిలిన రకాల దిగుబడులు బాగున్నాయి. అయితే ధరలు భారీగా పతనం కావడంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ఆందోళనతో అయినా ప్రభుత్వంలో కదలిక వచ్చి గిట్టుబాటు, మద్దతు ధరలు లభిస్తాయనే ఆశతో రైతులు ఉన్నారు.

అధికంగా లావు రకం సాగు

ఉమ్మడి పశ్చిమలో లావులు రకంగా (దేశవాళీ) పేరున్న మిర్చిని రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, దేవులపల్లి, పేరంపేట, ఏలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. దిగుబడి సన్నరకాలతో పోలిస్తే లావు రకానికి తక్కువ ఉన్నా ధరలు మాత్రం బాగుంటా యి. కూర కారం, పచ్చళ్ల కారం కోసం ఈ రకాన్ని వినియోగదారులు, వ్యాపారులు కొనుగోలు చేస్తా రు. ఈ రకాన్ని సేంద్రియ పద్ధతిలో దేవరపల్లి మండలంలో రైతులు పండిస్తున్నారు. మొత్తం డిమాండ్‌ను లావు రకం తీర్చలేని పరిస్థితుల్లో కర్ణాటక నుంచి వచ్చే బేడికి రకాలను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు ఖమ్మం జిల్లా వీఎం బంజరు, వెంకటాపురం, చర్ల ప్రాంతాల్లో మిర్చిని పండిస్తున్నారు. ఇక్కడ కూడా లావులు రకం పండుతున్నాయి. సన్నని రకాలైన 341, నంబర్‌ 05, బేడికి, తేజ రకాలు గూడెం మార్కెట్‌కు వస్తున్నాయి.

పడాల మార్కెట్‌కు 3 వేల బస్తాలు

జిల్లాలో ఎండు మిర్చి (దేశవాళీ రకం) వ్యాపారానికి కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెంలోని పడాల వ్యవసాయ మా ర్కెట్‌ యార్డుకు ఆదివారం 3 వేల శాల్తీల (బస్తాల) మిరప వచ్చింది. లావు రకాలతో పాటు సన్నాలైన 341, నంబర్‌ 05, బేడికి, తేజ రకాలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాతో పాటు తూ ర్పుగోదావరి జిల్లా అమలాపురం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఎండు మిర్చిని కొనుగోలు చేసి వెళ్లారు. వ్యాపారులు సరుకు బాగానే కొనుగోలు చేసినా సరైన ధరలు లేక రైతులకు నిరాశే ఎదురైంది.

పతనమైన ధర

రైతులు బెంబేలు.. నిల్వ చేసిన వ్యాపారులు గగ్గోలు

రెండేళ్ల క్రితం ఆశలు నింపిన సాగు

ప్రస్తుతం సగానికి పైగా తగ్గిన ధరలు

పడాల మార్కెట్‌కు మిర్చి నిల్వలు

కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో కుదేలు

గత సీజన్‌తో పోలిస్తే ధరలు ఇంకా పెరగాలి

ఎండు మిర్చి ధర గత సీజన్‌తో పోలిస్తే ఇంకా పెరగాలి. రైతులకు పెట్టుబడులు పెరిగాయి. ఈసారి దిగుబడులు బాగున్నా ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లేదు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

– ఎం.ప్రసాద్‌, వ్యాపారి, తాడేపల్లిగూడెం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement