
సాంకేతిక సంబరం.. విజ్ఞాన వికాసం
నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈనెల 25 నుంచి 27 వరకు జాతీయస్థాయి టెక్నికల్ ఫెస్ట్‌ను టెక్‌జైట్–25 పేరుతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫెస్ట్‌ను క్యాంపస్‌లోని స్టూడెంట్ డెవలప్‌మెంట్ క్యాంపస్ యాక్టివిటీ సెల్ (ఎస్‌డీసీఏసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. టెక్‌జైట్‌లో ట్రిపుల్ ఐటీకి చెందిన ఎనిమిది వేల మందితో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రెండు వేల మంది కలిపి 10 వేల మంది విద్యార్థులు పా ల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలకూ ఆహ్వానాలు పంపడంతో పాటు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ సైతం అందుబాటులో ఉంచారు. గతంలో నిర్వహించిన టెక్‌ఫెస్ట్‌లకు భిన్నంగా నూతన పంథాలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దక్షిణ భారతదేశంలోనే భారీగా..
దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద సాంకేతిక ఉత్సవంగా ఇది నిలవనుంది. టెక్‌జైట్ వల్ల విద్యార్థుల్లో సాంకేతిక సృజనాత్మకత పెరగడమే కాకుండా పరిశోధన సామర్థ్యాలు మెరుగుపడనున్నాయి. కోడింగ్ సవాళ్లు, రోబోటిక్స్ పోటీలు, సర్క్యూట్ డిజైనింగ్, హ్యాకథాన్‌ల వరకు వివిధ సాంకేతిక పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారు. పలు రంగాల్లో విశేష అను భవం కలిగినవారు, విజయాలను సాధించిన నిష్ణా తులతో వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేయడంతో పా టు విద్యార్థులకు ప్రసంగాలను సైతం ఏర్పాటుచేశారు. ట్రిపుల్‌ఐటీలోనే చదువుకుని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వ విద్యార్థులతో కూడా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
విద్యార్థులకు పోటీలు
ఇంజినీరింగ్ విద్యార్థులకు పలు రకాల పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. మెగా ఎక్స్‌పో, హ్యాకథాన్, వర్క్‌షాప్‌లు, ఈవెంట్లు, రోబో వార్స్ వంటి పోటీ లు నిర్వహించనున్నారు. అలాగే క్విజ్ పోటీలు, ఐపీఎల్ ఆక్షన్, ఫ్రీ ఫైర్, ఐఏఎస్ పోటీలు మరింత ఆక ర్షణగా నిలవనున్నాయి. డిపార్ట్‌మెంట్‌ల వారీగా వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేయనున్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న తాజా పురోగతులు, కెరీర్ మార్గదర్శకత్వం, వివిధ రంగాల్లో వస్తున్న నూతన ధోరణులు సహా పలు రకాల అంశాలు టెక్‌జైట్‌లో ఉన్నాయి.
మెటావర్స్ థీమ్‌తో..
మెటావర్స్ థీమ్‌తో టెక్‌జైట్‌ను నిర్వహిస్తున్నారు. అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ గురించి విద్యార్థులకు మరింత విజ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ థీమ్‌ను రూపొందించారు. ‘నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి పాతదైపోతున్న నేటి ఆధునిక యుగంలో రాబోయే రోజులన్నీ ఈ మెటావర్స్‌దే’ అన్న ఉద్దేశంతో మెటావర్స్ థీమ్‌గా తీసుకున్నారు.
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో టెక్‌జైట్–25
25 నుంచి జాతీయ స్థాయి ఫెస్ట్
Comments
Please login to add a commentAdd a comment