
రూ.46.95 లక్షల మిగులుతో జెడ్పీ బడ్జెట్ ఆమోదం
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ బడ్జెట్‌ను రూ.46.95 లక్షల మిగులుతో ఆమోదించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈమేరకు సభ్యులు ఏకగ్రీవంగా బడ్జెట్‌ను ఆమోదించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా పరిషత్ మొత్తం ఆదాయం రూ.153.16 కోట్లుగా, వ్యయం రూ.152.69 కోట్లుగా అంచనా వేశారు. దీంతో రూ.46.95 లక్షలు మిగులుతో బడ్జెట్‌ను ఆమోదించారు.
సమన్వయంతో పనిచేద్దాం
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో అభివృద్ధిలో కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆమె మొదటగా 1వ, 7వ స్థాయి సంఘాల సమస్యలు, రెండవ విడతగా 2, 3, 4, 5, 6 స్థాయి సంఘాల సమావేశాల్లో ఆయా అంశాలపై గురువారం సమీక్షంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన కొన్ని పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని నిర్ధేశించిన సమయంలోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవోను ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో కె.భీమేశ్వరరావు, మూడు జిల్లాల వివిధ శాఖల అధికారులు, పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
మొగల్తూరు రోడ్డు ప్రమాద ఘటనలో మరో వ్యక్తి మృతి
నరసాపురం: మొగల్తూరులో 216 జాతీయ రహదారి పక్కన పని చేసుకుంటున్న ఉపాధి హామీ కూలీలపై బుధవారం అదుపుతప్పి దూసుకొచ్చిన నూనె డబ్బాల వ్యాన్ బోల్తా ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుబ్బల మాణిక్యాలరావు (65) బుధవారం రాత్రి మృతి చెందాడు. ప్రమాదంలో మాణిక్యాలరావు భార్య గంగావతి, మరో మహిళ కడలి పావని అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మాణిక్యాలరావును మొదట నరసాపురం ఏరియా ఆసుపత్రికి, తరువాత మెరుగైన వైద్యం కోసం భీమవరం అక్కడ నుంచి గుంటూరు తరలించారు. ప్రమాదంలో లివర్ దెబ్బతినడంతో మాణిక్యాలరావు మృతి చెందాడు. కాగా నరసాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో కూలీ గుడాలి సత్యనారాయణను మెరుగైన వైద్యం నిమిత్తం గురువారం భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణ ప్రాంతాల్లో కూడా వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో స్వచ్ఛఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డీపీఓలతో ఇప్పటికే చర్చించామని, ఇందుకు కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.