
వైభవంగా ఎంబెరుమానార్ స్వామి రథోత్సవం
నరసాపురం రూరల్: శ్రీఆదికేశవ ఎంబెరుమానార్ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నరసాపురం పట్టణంలో రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి రథంలో ఉంచారు. ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చే కార్యక్రమంలో స్థానాచార్యులు కె.వెంకటాచార్యులు, అధ్యాపక స్వామి ముడుంబై మోహన నర్సింహాచార్యులు, అర్చక స్వాములు పెద్దింటి మోహన రామాచార్యులు, శ్రీనివాసుల జగన్నాథాచార్యులు, సుదర్శనం శేషాచార్యులు, శ్రీనివాసుల రామకృష్ణ పాలు పంచుకున్నారు. అనంతరం రథోత్సవం నిర్వహించారు. రథోత్సవానికి ముందు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్ఛారణలు చేపట్టారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్‌వీవీఎస్ రామచంద్రకుమార్, ఫౌండర్ ట్రస్టీ పుప్పాల వెంకట కృష్ణారావు, పుప్పాల ఆదినారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.