
మధుర ఫలం.. ధర పతనం
నూజివీడు: మామిడి దిగుబడి ఈ ఏడాది తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర ఎక్కువగా ఉంటుందన్న మామిడి రైతుల, తోటలు కొనుగోలు చేసిన వ్యాపారుల ఆశలు అడియాశలవుతున్నాయి. పండ్లలో రారాజుగా కీర్తిని సంపాదించుకున్న మామి డిని సాగు చేసిన రైతులకు నష్టాలను పంచుతోంది. రోజురోజుకూ మామిడి ధరలు పతనమవుతుండటంతో ఏంచేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలో మామిడి రైతులు, వ్యాపారులు కొట్టుమిట్టాడుతున్నారు. మామిడి దిగుబడి ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో మామిడి ధరలు బాగానే ఉన్నా రానురానూ పతనమవుతూ రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. కాయలకు డిమాండ్ ఉన్నా ధర మాత్రం పెరగడం లేదు. దీనంతటికీ మామిడి కాయలు కొనుగోలు చేసే సేట్‌లు సిండికేట్ కావడమే కారణమని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు ఈదురుగాలులు వీచి ఉన్న కాయలు ఎక్కడ రాలిపోతాయోనని రైతులు, తోటలు కొనుగోలు చేసిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
సీజన్ ప్రారంభంలో రూ.1.20 లక్షలు
మామిడి సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో ముంబై మార్కెట్‌లో బంగినపల్లి రకం టన్ను రూ.1.20 లక్షల ధర పలికింది. క్రమేణా ఆ ధర రూ.90 వేలకు, రూ.60 వేలకు తగ్గి ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. దీంతో కిరాయిలు, కోతఖర్చులు పోను రైతులకు గిట్టుబాటు కావడం లేదు. కలెక్టర్ (తోతాపురి) రకం పరిస్థితి సైతం అలాగే ఉంది. టన్ను ధర రూ.9 వేల నుంచి రూ.11 వేలు మాత్రమే లభిస్తోంది. పెట్టుబడులు పెరగడం, దిగుబడి పడిపోవడం, ధర తగ్గడంతో తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు, రైతులు లబోదిబోమంటున్నారు.
స్థానిక మార్కెట్‌లలో సైతం..
మామిడి దిగుబడి లేనప్పటికీ స్థానికంగా ఏర్పాటు చేసిన కమీషన్ దుకాణాల్లో కూడా ధర తక్కువగానే ఉంది. ఆగిరిపల్లి మండలం ఈదర, ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం, విస్సన్నపేటలో మామిడి కమీషన్ దుకాణాలు ఉన్నాయి. అక్కడ కూడా బంగినిపల్లి టన్నుకు రూ.20 వేల నుంచి రూ.25 వేల ధర మాత్రమే లభిస్తోంది. అలాగే తోతాపురికి రూ.9 వేలు లభిస్తోంది. లోకల్ దుకాణాల్లో సూటు పేరుతో టన్నుకు 100 కిలోల కాయలను తీసుకుంటున్నారని, కమీషన్ 10 శాతం వసూలు చేస్తున్నారని, వీటితో పాటు హమాలీ చార్జీలు తీసుకుంటుండటంతో రైతుకు మిగిలేది ఏమీ ఉండటం లేదని రైతులు అంటున్నారు. విజయవాడ సమీపంలోని నున్న మార్కెట్‌కు కాయలను తరలించే వారే కనిపించడం లేదు. ఇంతటి దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని, అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
మామిడి రైతులకు ఈ ఏడాది ఆదాయం పూర్తిగా పడిపోయిన క్రమంలో ప్రభుత్వం ఆదుకోవాలనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. మిగిలిన పంటలకు మాదిరిగా మామిడికి కూడా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మామిడి పంట లాటరీగా మారిందని, ఇవే పరిస్థితులు కొనసాగితే రాబోయే రోజుల్లో మామిడి పంట మనుగడ ప్రశ్నార్థకరంగా మారనుందని వాపోతున్నారు.
మామిడి.. తడబడి
బంగినపల్లి, కలెక్టర్ రకాల ధరలు దారుణం
దిగుబడి తక్కువే.. ధరా తక్కువే..
ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల డిమాండ్.
కాపు కలవరపాటు
మామిడికి పెట్టింది పేరైన నూజివీడు నియోజకవర్గంతో పాటు చింతలపూడి ప్రాంతంతో కలుపుకుంటే జి ల్లాలో 45 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. పూతలు బాగా వచ్చినా అందులో 20 శాతం కూడా పిందె నిలవలేదు. దీంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. అయితే దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర బాగా ఉంటుందనుకుంటే అది కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.