రేషన్ బియ్యం దందా.. 8మంది అరెస్ట్
నల్లగొండ క్రైం: జిల్లాలోని పలు రైస్ మిల్లుల నిర్వాహకులు ప్రభుత్వ గోదాం నుంచి రేషన్ బియ్యాన్ని నేరుగా మిల్లులకు తరలించి వాటిని ఇతర బ్యాగుల్లోకి మార్చి తిరిగి అవే బియ్యాన్ని ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యంగా సరఫరా చేస్తున్నారని నల్ల గొండ ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఈ దందా కొనసాగిస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేయడంతో పాటు 600 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసు వివరాలను సోమవారం ఏఎస్పీ రాములునాయక్‌తో కలిసి ఎస్పీ నల్లగొండలోని తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలంలోని తెప్పలమడుగు గ్రామ స్టేజీ వద్ద గల అమ్మ రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు అందిన సమాచారం మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్, పెద్దవూర పోలీస్ స్టేషన్ సిబ్బంది మిల్లులో తనిఖీలు చేయగా.. 600 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది.
ఐకేపీ సెంటర్ ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన రైస్ మిల్లులకు ధాన్యం సరఫరా చేసి, ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి వేర్‌హౌజ్ కార్పొరేషన్ స్టేజీ–1 గోదాంలోకి సప్లయ్ చేస్తారు. ఈ గోదాం నుంచి మండలస్థాయి స్టాక్ పాయింట్‌కు పీడీఎస్ బియ్యం పంపి అక్కడ నుంచి గ్రామాల్లోని రేషన్ డీలర్లకు సరఫరా చేస్తారు. బియ్యం సరఫరా సమయంలో లారీలకు జీపీఎస్‌తో పాటు ట్రక్ రసీదులు డీలర్‌కు అందజేస్తారు. డీలర్ నుంచి లబ్ధిదారులు బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు డీలర్లు లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా డబ్బులు, ఇతర వస్తువులు ఇచ్చి బియ్యాన్ని తమ వద్దనే నిల్వ చేసుకుంటున్నారు.
డీలర్లు మండలస్థాయి స్టాక్ పాయింట్ వద్ద నుంచి ప్రతినెలా తీసుకోవాల్సిన బియ్యంలో తక్కువ తీసుకొని కాగితాలపై మాత్రం మొత్తం తీసుకున్నట్లు రాయించి డబ్బులు తీసుకుంటున్నారు. మండలస్థాయి స్టాక్ పాయింట్ వారు కూడా వేర్‌హౌజ్ కార్పొరేషన్ గోదాం నుంచి బియ్యాన్ని తీసుకోకుండా కాగితాలపై తీసుకున్నట్లు రాయించి డబ్బులు తీసుకుంటున్నట్లు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. వేర్‌హౌజ్ కార్పొరేషన్ గోదాంలో పనిచేస్తున్న కొందరు అక్రమార్కులు రైస్ మిల్లర్లతో కుమ్మకై ్క ప్రభుత్వ గోదాం నుంచి రేషన్ బియ్యాన్ని నేరుగా ఇతర మిల్లులకు తరలిస్తున్నారని, వాటిని మిల్లర్లు ఇతర బ్యాగుల్లో ప్యాక్ చేసి తిరిగి అవే బియ్యాన్ని ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్‌గా సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ బియ్యాన్ని ఏపీలోని కాకినాడ పోర్టు ద్వారా ఇతర ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు.
అరెస్టయ్యింది వీరే..
ఈ దందాకు సంబంధించి ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అమ్మ రైస్ మిల్లు యజమాని మల్గిరెడ్డి రామానుజరెడ్డి, అనుముల మండలం హాలియాకు చెందిన సివిల్ సప్లయ్ స్టేజ్–2 కాంట్రాక్టర్ బూరుగు శ్రీనివాసులు, హాలియాలోని హనుమాన్ రెసిడెన్సీ కాలనీకి చెందిన కుక్కడపు రమేష్, నల్లగొండ పట్టణ సమీపంలోని మర్రిగూడకు చెందిన పేర్ల శ్రీకాంత్, అదే గ్రామానికి చెందిన లింగాల మల్లేష్, పెద్దవూర మండలం తెప్పలమడుగుకు చెందిన వెంపటి సంతోష్‌కుమార్, అదే గ్రామానికి చెందిన లింగంపల్లి సైదులు, హాలియాలోని ప్రతాప్‌నగర్‌కు చెందిన ఎడ్ల ఆంజనేయులును అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి ప్రభుత్వాన్ని మోసం చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. ప్రభుత్వ పథకాల్లో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment