
స్వర్ణగిరీశుడికి తిరుప్పావడ సేవ
భువనగిరి: పట్టణంలోని స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం స్వామివారికి తిరుప్పావడ సేవ నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణం, సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామును సుప్రభాత సేవతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రధానాలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధుడు మృతి
మిర్యాలగూడ టౌన్: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ లక్ష్మ య్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన మారేపల్లి సైదులు(60) బుధవారం మిర్యాలగూడ మండలం శ్రీనివాస్‌నగర్ సమీపంలో గల ఫంక్షన్‌హాల్‌లో తన బంధువుల వివాహానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో జడ్జర్ల–కోదాడ హైవేపై రోడ్డు దాటుతుండగా తుంగపాడు నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బైక్ సైదులును ఢీకొట్టింది. దీంతో అతడి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ సాయంతో స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమార్తె సట్టు నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైలు ఎక్కుతుండగా జారిపడిన ప్రయాణికుడు
ఫ రక్షించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది
భువనగిరి: రైలు ఎక్కే క్రమంలో జారిపడిన వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) సిబ్బంది రక్షించారు. ఈ ఘటన బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్‌లో జరిగింది. భువనగిరి ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బాజిరెడ్డి జగదీష్ అనే ప్రయాణికుడు నిజామాబాద్‌కు వెళ్లేందుకు బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్‌లో టికెట్ తీసుకున్నాడు. రాత్రి 8.22 గంటలకు తిరుపతి నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు భువనగిరికి చేరుకుంది. రాత్రి 8.23 గంటలకు స్టేషన్ నుంచి రైలు కదలగా.. జగదీష్ రైలు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో జారిపడ్డాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ బాలాజీ గమనించి జగదీష్‌ను బయటకు లాగాడు. దీంతో అతడికి ఎటువంటి గాయాలు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment