నారాయణ... నారాయణ!
టీచర్లను వేధిస్తున్న యూనియన్ నేతలు
ఓ విద్యాధికారి రిటైర్మెంట్ ఫంక్షన్ పేరిట చందాలు
అమౌంట్ ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్న వైనం
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆయనో మండల విద్యాధికారి. కీలకమైన కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. పదవీ విరమణ సమయం ఆసన్నమైంది. అదే సాకు చూపెట్టి భారీ వసూళ్లకు తెరలేపారు. అందుకు ఉపాధ్యాయ యూనియన్ నేతలు నడుంబిగించారు. రిటైర్మెంట్ ఫంక్షన్ భారీగా నిర్వహించాలంటూ తెరపైకి వచ్చారు. టీచర్లను వ్యక్తిగతంగా కలుస్తూ రూ.2 వేలు తక్కువ లేకుండా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
చందా పుస్తకాలు చేతబట్టుకొని మరీ అయ్యవార్ల వద్దకు వెళ్తున్నారు. ఇదేంటీ ఎంత ఇవ్వాలో కూడా మీరే నిర్ణయిస్తారా? అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దూషణలకు దిగుతున్నారు. సుధీర్ఘకాలం పనిచేసి రిటైర్డ్ అవుతున్న అధికారిని సన్మానించుకోవడం సముచితమే. పదవీ విరమణ సందర్భంలో అప్పటివరకు అందించిన సేవలకు గుర్తుగా ఆ ఉద్యోగులు వ్యక్తిగతంగా గౌరవించుకోవడం అనవాయితీ. కాగా తద్భిన్నమైన పరిస్థితులను ఉపాధ్యాయ సంఘాల నేతలు తెరపైకి తెచ్చారు. ఎంఈఓగా రిటైర్డ్ అవుతున్న ఓ అధికారికి సన్మానం పేరిట వసూళ్లకు తెరలేపారు.
దాదాపు 440 మంది ఉపాధ్యాయులుడగా అందరీతో చందా రాబట్టాలనే దిశగా గుంపుగా వెళ్తూ విడివిడిగా అయ్యవార్లను కలుస్తున్నారు. యూనియన్ నేతల్ని చూసి తలాడించేవారు కొందరైతే, అంతే ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏమిటనీ మరి కొందరు నిలదీస్తున్నారు. అలాంటి వారితో గొడవలకు దిగడం యూనియన్ నేతల వంతైంది. మరోవైపు ప్రవేటు పాఠశాల యాజమాన్యాలను సైతం వదిలిపెట్టడం లేదు. జిల్లా విద్యాధికారి, పాఠశాల విద్యా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఈవ్యవహారంపై దృష్టి సారించి చందాలు పేరిట టీచర్లను బెదిరిస్తున్న యూనియన్ నేతల్ని కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
Comments
Please login to add a commentAdd a comment