మనవరాలి వయసున్న బాలికపై అత్యాచారం
కరస్పాండెంట్ చేష్టలను పిన్నికి ఫోన్‌లో తెలిపిన విద్యార్థిని
అనంతపురం లిటిల్‌ఫ్లవర్ స్కూల్ కరస్పాడెంట్ ఆంజనేయులుపై పోక్సో కేసు
అనంతపురం : అనంతపురం నగరంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ నాల్గో తరగతి చదువుతున్న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాజంలో ఇన్నాళ్లూ పెద్ద మనిషిగా చలామణి అయిన 73 ఏళ్ల ఇతను మనవరాలి వయసు ఉన్న అభం శుభం తెలియని చిన్నారిని లోబరచుకుని అకృత్యానికి ఒడిగట్టాడు. అమానుష ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
బాధిత చిన్నారి తల్లిదండ్రులు ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన వారు. బతుకుదెరువు కోసం దుబాయిలో ఉంటున్నారు. దీంతో పిన్ని సంరక్షణలో చిన్నారి ఉంటోంది. రెండు నెలల క్రితం లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో నాల్గో తరగతిలో చేర్పించారు. కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ గత శని, ఆదివారం రెండు దఫాలు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు చిన్నారి తన పిన్నికి ఫోన్‌లో తెలిపింది.
ఇందుకు సంబంధించిన ఫోన్ సంభాషణను పోలీసులకు అప్పగించారు. ‘నగ్నంగా మీద పడుకోవాలని సార్ (ఆంజనేయులు గౌడ్) తరచూ అంటుంటాడు. క్లాస్‌కు వెళ్లాలి.. సార్ కొడతారని చెప్పినా వినకుండా నన్ను అలా చేశారు. ఒకసారి డబ్బులు కూడా ఇచ్చాడు. అవి పెట్టెలో పెట్టి తాళం వేయడం మరచిపోయాను. దీంతో డబ్బులు ఎవరో తీసుకున్నార’ని అమాయకంగా వివరించింది. ఈ మాటలు విన్న పిన్ని, బాబాయ్ బోరున విలపిస్తూ శుక్రవారం ఉదయమే పాఠశాల వద్దకు చేరుకున్నారు.
అక్కడే ఉన్న కరస్పాండెంట్‌ను నిలదీశారు. ఇంతలోనే విద్యార్థి సంఘాల నాయకులకు విషయం తెలియడంతో వారు కూడా వచ్చి కరస్పాండెంట్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతన్ని టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతపురం అర్బన్ డీఎస్పీ టీవీవీ ప్రతాప్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఆంజనేయులు గౌడ్ నుంచి కీలక విషయాలను రాబట్టారు. లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైందని, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో చిన్నారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
టీడీపీ నాయకుల అండ
కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్‌కు మద్దతుగా టీడీపీకి చెందిన కొందరు నాయకులు సోషల్ మీడియాలో అనుకూల పోస్టింగ్‌లు పెట్టారు. అభం శుభం తెలియ ని విద్యార్థినిపై అఘాయిత్యం జరిగితే ఖండించాల్సింది పోయి.. కీచక కరస్పాండెంట్‌కు అనుకూలంగా పోస్టింగ్‌లు పెట్టడం గమనార్హం. వారి తీరును సామా న్య ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
నిందితుణ్ని కఠినంగా శిక్షించాలి
చిన్నారి ఫోన్‌లో విషయం చెప్పడంతో పాఠశాల వద్దకు వచ్చాం. పాప ఏడుస్తూనే ఉంది. ఏమి జరిగింది చెప్పమ్మా అంటే.. జరిగినది మొత్తం వివరించింది. వెంటనే మా అన్న, మా చెల్లి వాళ్లకు ఫోన్ చేసి చెప్పాను. మా అన్నవాళ్లు అందరూ వచ్చారు. తెలుగు టీచర్ చెప్పింది అంట .. ఇక్కడ జరిగింది మీ వాళ్లకు చెబితే టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరించారట. జరిగిన దాని గురించి చెప్పొద్దు. డబ్బులు ఇస్తామని చెప్పారు. డబ్బులు కూడా పాపకు ఇచ్చారు. అఘాయిత్యానికి పాల్పడిన పాఠశాల కరస్పాండెంట్‌ను కఠినంగా శిక్షించాలి. – చిన్నారి పిన్ని
Comments
Please login to add a commentAdd a comment