ప్రశాంతంగా నీటి సంఘాల ఎన్నికలు
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభాభవన్‌లో సాగునీటి వినియోగదారుల సంఘ ఎన్నికల నిర్వహణపై జిల్లా నీటి వనరుల శాఖ, మండల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వంద ఎకరాలకు పైబడి ఆయకట్టు కలిగిన చెరువులకు సంబంధించి డిసెంబర్ 8న నీటివినియోగదారుల/సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించి డిసెంబరు 5న ప్రకటన వెలువడనుందన్నారు. డిసెంబరు 8న ఒకే రోజు పూర్తి ఎన్నికల ప్రక్రియ ఉంటుందని, ఇందులో నామినేషన్లు ప్రక్రియ, 6 మంది ప్రాదేశిక సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. మైనర్, మీడియం, మేజర్ అనే మూడు కేటగిరీల నీటి వనరులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలో 3 ప్రాజెక్టు కమిటీలు, 11 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 205 నీటి వినియోగదారుల కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎన్నిక అనంతరం ఆయా సాగునీటి సంఘాల ద్వారా రైతులు తమ చెరువులను తామే ప్రభుత్వ సహకారంతో నిర్వహించుకోగలుగుతారన్నారు. కార్యక్రమంలో జేసీ అదితిసింగ్, డీఆర్‌ఓ శ్రీనివాసులు, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, డీఈవో మీనాక్షి, తదితరులు పాల్గొన్నారు.
నవ్వుతూ అర్జీలు స్వీకరించాలి
గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చే ప్రజల బాధను సహృదయంతో అర్థం చేసుకుని వారిని ఆప్యాయతతో పలుకరిస్తూ నవ్వూతూ అర్జీలు స్వీకరించాలని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక నోడల్ అధికారి ఓబులమ్మ, పీజీఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో వచ్చిన గ్రీవెన్స్‌లను ఏ విధంగా పరిష్కరించి ఎండార్స్‌మెంట్ ఇవ్వాలో వివరించారు.
ఇసుక పంపిణీ ప్రక్రియ
సజావుగా జరగాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పంపిణీ ప్రక్రియ సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ అనుమతులు పొందిన సిద్ధవటం మండలంలోని గుండ్లమూల, చక్రాయపేటలోని గండికోవూరు, వియన్ పల్లి లోని తగేడుపల్లి మూడు సెమీ మెకనైజడ్ ఇసుక రీచ్‌లకు నోటిఫికేషన్ ఇచ్చి టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఈ మూడింటికి సంబంధించి 13 టెండర్ అప్లికేషన్లు రాగా.. 11 అర్హత పొందాయని తెలిపారు. తంగేడుపల్లి ఇసుక రీచ్‌ను అంకిరెడ్డి అండ్ సన్స్ రూ. 24.50 బిడ్ ధరకు దక్కించుకుందన్నారు. మిగతా రెండు రీచ్‌లకు సంబంధించి తక్కువ ధరకు కోట్ చేసిన వాటికి నోటీసులు ఇచ్చి జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎస్‌సీ) నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
●తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం తప్పనిసరి
పాఠశాలల పనితీరు మెరుగు పరచడంలో భాగంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీధర్ ఎంఈఓలు, ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాలల మధ్య ఒక ధృడమైన బంధం ఏర్పరిచేందుకే ప్రభుత్వం పీటీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్య, ప్రవర్తన పరంగా ఏ స్థాయిలో ఉన్నారో, సామాజిక అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు.
అధికారులకు కలెక్టర్ శ్రీధర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment