స్టెమి ప్రాజెక్టుతో గుండెకు భరోసా | - | Sakshi
Sakshi News home page

స్టెమి ప్రాజెక్టుతో గుండెకు భరోసా

Published Sun, Feb 16 2025 12:29 AM | Last Updated on Sun, Feb 16 2025 12:26 AM

స్టెమ

స్టెమి ప్రాజెక్టుతో గుండెకు భరోసా

ప్రొద్దుటూరు క్రైం : హార్ట్‌ ఎటాక్‌ కేసుల్లో గోల్డెన్‌ అవర్‌ ఎంతో కీలకం. ఏ మాత్రం ఆలస్యం చేసినా పేషెంట్‌ ప్రాణాలకే ప్రమాదమని కార్డియాలజిస్టు హెచ్చరిస్తున్నారు. స్ట్రోక్‌ వచ్చిన వారిలో 50 శాతం హాస్పిటల్‌కు చేరకముందే చనిపోతున్నారు. తీవ్రమైన కేసుల్లో హాస్పిటల్‌కు వచ్చాక కూడా 90 శాతం మంది మరణించే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఛాతిలో నొప్పి వచ్చాక గంటలోగా హాస్పిటల్‌కు చేరితే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. ఆలస్యమైతే గుండె కండరాలకు శాశ్వత నష్టం ఏర్పడుతుంది. గతంలో గుండె సంబంధిత వ్యాధులు, గుండె పోటుకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర ప్రాథమిక చికిత్స దొరికేది కాదు. జిల్లా కేంద్రాల్లోని బోధనా ఆస్పత్రులు, సూపర్‌స్పెషాలిటి కార్పోరేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. ఒక వేళ స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తే పరీక్షలు, మందుల ఖర్చులు పక్కన పెడితే ఒక్క ఇంజెక్షన్‌కే రూ. 45–50 వేలు వెచ్చించాల్సి వచ్చేది. ఈ మొత్తాన్ని భరించడం పేదలు, మధ్య తరగతి వారికి మిక్కిలి భారంగా మారేది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె జబ్బులకు అత్యవసర ప్రాథమిక వైద్యం లేక, ఖర్చుల భయంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లలేక గుండె జబ్బు వచ్చిన పేదలు, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడేవారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో గుండెకు భరోసా

ఏపీలో గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును తగ్గించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2023లో శ్రీస్టెమి ప్రాజెక్ట్‌శ్రీకు శ్రీకారం చుట్టింది. గుండె పోటు వచ్చిన వారికి అత్యంత కీలకమైన మొదటి గంటలోనే అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను నిలబెట్టే కార్యక్రమమే ఈ స్టెమీ ప్రాజెక్ట్‌. గుండె పోటు వచ్చిన తొలి గంటలోపే అంటే గోల్డెన్‌ అవర్‌లోపే అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా రోగి ప్రాణాలను నిలబెట్టేందుకు అవకాశం ఉంది. గుండె పోటుకు గురై మరణించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కార్డియాలజి, కార్డియోవాస్క్యులర్‌ సేవలను మరింత విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని భావించిన అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలు, పీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రుల్లో హృద్రోగ చికిత్స అందుబాటులోకి తెచ్చింది. గుండె పోటు వచ్చిన 40 నిమిషాల సమయంలో రోగికి అవసరమైన చికిత్సను అందించి ప్రాణాపాయం నుంచి కాపాడటమే ‘స్టెమీ ప్రాజెక్ట్‌’ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. అంతేగాక గోల్డెన్‌ అవర్‌లో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన గుండె జబ్బు బాఽధితుడికి రూ. 45 వేల ఇంజెక్షన్‌ను ఉచితంగా ఇవ్వడంతో పాటు సమీపంలోని హబ్‌ సెంటర్లకు తరలించి గుండెపోటుకు చికిత్స అందించేలా నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గుండె పోటు వచ్చిన వారికి సకాలంలో అత్యవసర ప్రాథమిక వైద్యం అందడంతో చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు.

జిల్లా ఆస్పత్రిలో 36 మందికి

టెనెక్ట్‌ప్లస్‌ ఇంజెక్షన్‌లు

స్టెమి ప్రాజెక్ట్‌ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో 36 మందికి రూ. 45 వేలు విలువ చేసే టెనెక్ట్‌ప్లస్‌ ఇంజెక్షన్‌లను ఉచితంగా వేశారు. ప్రొద్దుటూరు, పరిసర ప్రాంతాలకు చెందిన వీరంతా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన వారే. వీరిలో ఇద్దరు మృతి చెందారని, మిగిలిన 34 మంది ప్రాణాపాయం నుంచి బయట పడి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆనంద్‌బాబు తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ఎప్పటికీ 6 ఇంజెక్షన్‌లు అందుబాటులో ఉంటాయని, ఏ సమయంలో ఆస్పత్రికి వచ్చినా అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తామని తెలిపారు. టెనెక్ట్‌ప్లస్‌ ఇంజెక్షన్‌లు పూర్తిగా ఉచితమన్నారు. అత్యవసర విభాగంలో వైద్యుడితో పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఇదే ఇంజెక్షన్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వేస్తే రూ. 45 వేలు తీసుకుంటారని తెలిపారు. ఛాతిలో నొప్పి, ఎడమ భుజం లాగడం, ఆకస్మిక ఆయాసం, గుండెదడ, స్పృహ కోల్పవడం తదితర గుండె పోటు లక్షణాలని పేర్కొన్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే 108 అంబులెన్స్‌ లేదా ఇతర మార్గాల ద్వారా గంటలోపు జిల్లా ఆస్పత్రికి రావాలన్నారు. ఆస్పత్రికి వచ్చిన వెంటనే ఈసీజీ తీస్తారు. రిపోర్టులో గుండె పోటు అని నిర్ధారణ అయితే వెంటనే టెనెక్ట్‌ప్లస్‌ ఇంజెక్షన్‌ వేస్తారు. తర్వాత 4–5 గంటల్లోగా బాధితుడిని కడపకు తీసుకెళ్తే అక్కడి రిమ్స్‌ లేదా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో గుండె పోటుకు సంబంధించి ఉచితంగా చికిత్స అందిస్తారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్టెమి ప్రాజెక్ట్‌ పథకం పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎంతో మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు.

గుండె జబ్బు మరణాలను

తగ్గించడమే లక్ష్యం

2023లో ప్రారంభించిన

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

అత్యవసర ప్రాథమిక చికిత్సతో

తగ్గిన గుండె పోటు మరణాలు

మొదటి గంటలోపు ఆస్పత్రికి రావాలి

గుండె పోటు వస్తే జిల్లా ఆస్పత్రికి వెంటనే రావాలి. ఆలస్యం చేయకుండా మొదటి గంటలోపు ఆస్పత్రికి చేరుకోవాలి. జిల్లా ఆస్పత్రిలో గుండె పోటుకు అత్యవసర ప్రాథమిక చికిత్స ఇస్తారనే విషయం చాలా మందికి తెలియదు. గుండె పోటు నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ఖరీదైన రూ.45 వేలు విలువ చేసే టెనెక్ట్‌ప్లస్‌ ఉచితంగా అందిస్తోంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– డాక్టర్‌ ఆనంద్‌బాబు, జిల్లా ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌, ప్రొద్దుటూరు

No comments yet. Be the first to comment!
Add a comment
స్టెమి ప్రాజెక్టుతో గుండెకు భరోసా1
1/2

స్టెమి ప్రాజెక్టుతో గుండెకు భరోసా

స్టెమి ప్రాజెక్టుతో గుండెకు భరోసా2
2/2

స్టెమి ప్రాజెక్టుతో గుండెకు భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement