డ్రైవర్లు ఏకాగ్రతతో బస్సులు నడపాలి
ప్రమాద రహిత డ్రైవర్లకు ఘన సన్మానం
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏకాగ్రతతో విధులు నిర్వర్తించి ప్రమాద రహిత ఆర్టీసీ డ్రైవర్లుగా నిలవాలని పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్, జడ్జి స్వర్ణప్రసాద్ పిలుపునిచ్చారు. 36వ రోడ్డు భద్రతామాసోత్సవాల సందర్భంగా శనివారం స్థానిక ఆర్‌ఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో ప్రమారరహిత డ్రైవర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి స్వర్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉంటుందన్నారు. విధి నిర్వహణలో ఏకాగ్రత కోల్పొతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. గ్యారేజీలో నుంచి బస్సును తీసుకునేటపుడు కండీషన్‌లో ఉందో, లేదో సరిచూసుకోవాలన్నారు. ఆర్టీసీ ఈడీ చంద్రశేఖర్ మాట్లాడుతూ డ్రైవర్లు ప్రశాంతమైన మనస్సుతో బస్సును నడపాలని సూచించారు. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రతినిత్యం జాగరూకతతో వ్యవహారించాలన్నారు. రవాణా శాఖ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రమాదాలు చేయని డ్రైవర్లు ఉండడం స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థకు రోడ్డు ప్రమాద రహిత సంస్థగా పేరొందని, ఆ పేరును నిలబెట్టేందుకు ప్రతి డ్రైవరు కృషి చేయాలన్నారు. డ్రైవర్ల కారణంగా సంస్థకు మంచి పేరు వస్తుందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.
ప్రమాద రహిత డ్రైవర్లకు సత్కారం:
కడప జోన్ పరిధిలో ప్రమాద రహిత డ్రైవర్లుగా నిలిచిన వి.ప్రసాద్ (ప్రొద్దుటూరు డిపో), ఎం.ప్రసాద్ (తాడిపత్రి), ఈ.నాగరాజు (శ్రీ సత్యసాయి), జీకే మోహిద్దీన్ (అనంతపురం), ఎస్‌ఏ షరీఫ్ (కడప), ఎంసీఓ రెడ్డి (ప్రొద్దుటూరు), బీజీ స్వామి (పులివెందుల), బి.వెంకటయ్య, బీజే నాయక్, వీఎస్ రాయుడు (కడప), ఎస్‌ఎం బాష, ఎల్‌ఏఎన్ రెడ్డి, జీఆర్‌ఎస్ రెడ్డి (పులివెందుల), బీవీబీ రెడ్డి, ఎస్‌జే బాష, ఎస్‌కే బాష (బద్వేలు), ఎం.మనోహర్, ఎంఆర్ శంకర్, ఎంజే ఐజయ్య (జమ్మలమడుగు), ఎల్‌ఎస్‌రెడ్డి, ఆర్‌ఏ సత్తార్, డి.హుసేన్ (మైదుకూరు), ఎంఎస్‌కుమార్, ఏఎస్ రాయుడు, ఎం.అయ్యవారప్ప(ప్రొద్దుటూరు)లను సత్కరించారు. కార్యక్రమంలో కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు, పీఓ ధనలక్ష్మి, సూపరింటెండెంట్ రవి, అసిస్టెంట్ మేనేజర్లు శ్రీలత, మంజుల, కన్యాకుమారిలతో పాటు యూనియన్ నాయకులు ఏఆర్ మూర్తి, పురుషోత్తం, సగినాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment