వెంటాడుతున్న చిరుత భయం
పులివెందుల రూరల్ : పులివెందుల మండల పరిధిలోని తుమ్మలపల్లె గ్రామ సమీపంలో ఆదివారం చిరుత పిల్ల కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుతలు సంచరిస్తున్నాయని వారు భయాందోళన చెందుతున్నారు. గత 30 రోజులుగా చిరుత, వాటి పిల్లలు లింగాల, పులివెందుల, సింహాద్రిపురం మండలాల్లోని గ్రామాల్లో సంచరిస్తున్న విషయం విదితమే. లింగాల, పులివెందుల మండలాల్లో ప్రతి రోజు ఏదో ఒక గ్రామంలో చిరుత అడుగులు, చిరుత పిల్లలు కనిపిస్తూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్పా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ప్రాణాలు పోయే వరకు స్పందించరా..
సింహాద్రిపురం, లింగాల, పులివెందుల మండలాల్లో చిరుతలు సంచరిస్తున్నాయని ఫారెస్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఏమాత్రం స్పందించకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాణాలు పోయేంత వరకు అధికారులు మీరు స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం పులివెందుల మండల పరిధిలోని తుమ్మలపల్లె గ్రామ సమీపంలో నూగు పంటలో చిరుత పిల్ల కనిపించిందని గ్రామానికి చెందిన గంగిరెడ్డి తెలిపారు అలాగే లింగాల మండల కేంద్ర సమీపంలో చిరుత అడుగు జాడలు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. అటవీ అధికారులు ఇంకా ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జంతువుల ప్రాణాలకే కాదు ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా అటవీ అధికారుల దాటవేత వైఖరికి కారణమేంటో అర్థం కావడం లేదు. ఇప్పటికై నా వారు స్పందిస్తారా.. ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే.
లింగాలలో పులి అడుగుజాడలు
లింగాల : మండల కేంద్రమైన లింగాలలో చిరుత పులుల అడుగుజాడలు కనిపించాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలోని చౌడమ్మ పొలాల్లో ఆదివారం ఒక చిరుత పులి, రెండు చిరుత పులి పిల్లల అడుగుజాడలు కనిపించాయని గ్రామస్తులు తెలిపారు. అలాగే గ్రామానికి చెందిన వాసుదేవ రెడ్డి అనే రైతు పొలంలోని అరటి తోటలో కూడా అడుగుజాడలు కనిపించాయన్నారు. పులులు సంచరిస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం ఫారెస్ట్ అధికారి మహబూబ్ బాషా పరిశీలించారు. రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పులివెందుల రూరల్ : పులివెందుల, లింగాల, సింహాద్రిపురం మండలాల్లోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ సీఐ రమణ తెలిపారు. ఆదివారం ఆయన పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింహాద్రిపురం మండలం రామాపురం, బలపనూరు గ్రామాల శివారు ప్రాంతాలలో 10 రోజుల కిత్రం విద్యుత్ తీగలు తగులుకుని మగ చిరుత మృతి చెందింది. దీంతో ఆడ చిరుతతో పాటు రెండు పిల్లలు సింహాద్రిపురం, లింగాల మండలాల్లోని పలు గ్రామాలలో సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తోటల వద్దకు వెళ్లే రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుతలు సంచరించే గ్రామాలలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఎక్కడైనా చిరుతలు కనిపిస్తే వెంటనే సంబంధిత ఫారెస్ట్ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
తుమ్మలపల్లె సమీపంలో
చిరుత పిల్ల సంచారం
పట్టించుకోని అటవీ అధికారులు
భయాందోళనలో గ్రామస్తులు
వెంటాడుతున్న చిరుత భయం
వెంటాడుతున్న చిరుత భయం
వెంటాడుతున్న చిరుత భయం
Comments
Please login to add a commentAdd a comment