ఆపద వేళ అండగా పోస్టల్ బీమా
● తపాలాశాఖ ఖాతాదారులకు ప్రత్యేకం
● రూ.10 లక్షలు, రూ. 15 లక్షలు బీమా పథకాలు
● 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్కులు మాత్రమే అర్హులు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : పేద, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీని ప్రవేశ పెట్టింది తపాలా శాఖ. రూ.599 ప్రీమియంతో రూ. 10 లక్షలు , రూ.799 ప్రీమియంతో రూ. 15 లక్షలు బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. పాలసీదారుడికి ఎలాంటి ప్రమాదం సంభవించినా బీమా తీసుకున్నప్పటి నుంచి ఏడాది పాటు కవరేజ్ వర్తిస్తుంది. 18 నుంచి 65 ఏళ్ల వయస్కుల వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయి. 2022 ఏప్రిల్‌లో తొలిసారిగా తపాలాశాఖ ఈ పథకాలను ప్రవేశ పెట్టింది. ఇప్పటికే కడప డివిజన్‌లో అధిక సంఖ్యలో పాలసీలను తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పాలసీ పొందాలంటే..
ఈ పాలసీలు పొందాలంటే ముందుగా పోస్టల్ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. ఖాతా లేనివారు రూ. 200తో నూతనంగా తెరవాలి. బీమా పాలసీకి రూ.599 గానీ, రూ.799 గానీ చెల్లించాలి. ప్రమాదం సంభవిస్తే మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. దీర్ఘకాలిక పక్షవాతం ఉన్నవారికి వర్తించదు. పాలసీ కోసం నగదు చెల్లించిన రోజు అర్థరాత్రి 12 గంటల నుంచి బీమా రక్షణ లభిస్తుందని అధికారులు తెలిపారు. పాలసీదారులకు ఒక బాండ్ కూడా ఇస్తామన్నారు.
ప్రయోజనాలీవీ..
● రూ.799 రూ.599 చెల్లిస్తే స్టార్ ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా బీమా
● ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.15 లక్షలు, రూ.10 లక్షలు
● శాశ్వత, పాక్షిక వైకల్యం అయితే రూ.15 లక్షలు, రూ.10 లక్షలు
● పిల్లల విద్యా ప్రయోజనం కోసం రూ. 50 వేలు, గృహ స్వస్థత రూ. 7వేలు, రూ. 5వేలు
● ప్రమాదం జరిగితే వైద్య ఖర్చులకు రూ. లక్ష, రూ. 75 వేలు
● హాస్పిటల్ నగదు ప్రయోజనం రోజుకు రూ. వెయ్యి (రూ. 6 వేల వరకు)
● దిగుమతి చేసుకున్న మందులు రవాణా ఖర్చులకు రూ. 14 వేలు, రూ.12 వేలు
● అంబులెన్స్, పార్థివదేహాన్ని తరలించేందుకు రవాణా ఖర్చులు రూ. 11 వేలు, రూ. 9 వేలు
● ఒక బంధువు ప్రయాణ ఖర్చు రూ. 11 వేలు, రూ. 9 వేలు
● అంత్యక్రియల ఖర్చులు రూ. 9 వేలు, రూ. 7 వేలు అన్‌లిమిటెడ్ టెలికన్సల్టెన్సీ
● ప్రమాదం ఏ విధంగా జరిగినా పాలసీ కచ్చితంగా వర్తించేలా నిబంధనలు రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment